GPS Tracking Help For Anti Theft Solution and Recover Stolen Vehicles : ఇటీవల కాలంలో ఆటోలు, ద్విచక్ర వాహనాల చోరీపై పోలీసులకు అధిక ఫిర్యాదులు అందుతున్నాయి. లారీలు, బస్సులు, కార్లను సైతం కేటుగాళ్లు అపహరించుకెళుతున్న ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. చోరీల తరువాత బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే దొంగను పట్టుకోవడానికి రోజులు, నెలలు, సంవత్సరాలు పడుతోంది. కొన్ని సందర్భాలలో సంవత్సరాల తరబడి దొంగలు దొరకపోవడంతో ఆ వాహనాలను మర్చిపోవాల్సిన పరిస్థితి. పేద, దిగువ మధ్య తరగతి ప్రజలకు ప్రస్తుత రోజుల్లో ద్విచక్ర వాహనం కొనుగోలు ఆర్థికంగా భారమే. అలాంటి వాటిని నేరగాళ్లు నిమిషాల్లో అపహరించుకెళ్లడంతో బాధితుల ఆవేదన వర్ణనాతీతం.
మార్కెట్‌లో ట్రాకింగ్ పరికరాలు : ఇలాంటి దొంగతనాల కట్టడికి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలు ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. నాణ్యతను బట్టి రూ.1000 నుంచి అందుబాటులో ఉన్నాయి. వాటిని కార్లు, ఆటోలు, బస్సులు, ద్విచక్రవాహనాలు ఇలా అన్నింటికి అమర్చుకోవడం వల్ల ఆ వాహనాలను దొంగల బారి నుంచి కాపాడుకోవచ్చు.
చరవాణికి సంక్షిప్త సందేశం : జీపీఎస్ అమర్చాక యాప్ ద్వారా చరవాణికి అనుసంధానం చేసుకోవచ్చు. వాహనం పార్కింగ్ చేసిన చోటు నుంచి దొంగలు అపహరించుకెళ్తుంటే వెంటనే శబ్దాలు రావడంతోపాటు చరవాణికి సంక్షిప్త సందేశం వస్తుంది. దీంతో వెంటనే అప్రమత్తం కావొచ్చు. ఒకవేళ వాహనం తస్కరించుకెళ్లినా ఎక్కడ ఉందనేది జీపీఎస్ ద్వారా ఇట్టే తెలిసిపోతుంది. తద్వారా పోలీసుల సాయంతో ఆ వాహనాన్ని తిరిగి తెచ్చుకోవచ్చు.