Govt set up a SIT on Incidents of Election Violence in AP:రాష్ట్రంలో పోలింగ్ తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రాథమిక విచారణ పూర్తిచేసింది. ప్రాథమిక విచారణకు సంబంధించిన నివేదికను సీఈవో కార్యాలయం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది. ఆ నివేదిక ఆధారంగా ఈసీ ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(Special Investigation Team) నియమించనుంది. కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఏడీజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్(SIT) ఏర్పాటు కానుంది. కాగా హింసాత్మక ఘటనలపై ఇప్పటికే ప్రాథమిఖ స్థాయిలో విచారణ మొదలుపెట్టినట్లు సమాచారం. రేపటిలోగా పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో చోటుచేసుకున్న ప్రతి ఘటనపైనా సిట్ ఈసీకి నివేదిక ఇవ్వనుంది. సిట్ నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యలు తీసుకోనుంది.
హింసాత్మక ఘటనలకు కారణమైన కొందరు కీలక నేతల అరెస్టులు జరిగే అవకాశం ఉంది. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న అలాగే కొందరు అభ్యర్థులతో అంటకాగిన పోలీసు అధికారులపైనా తీవ్ర చర్యలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఘటనలు చోటుచేసుకున్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను గృహ నిర్బంధం చేశారు. ఆయా అభ్యర్థుల ఇళ్ల వద్ద సాయుధ పోలీస్ పికెట్లు ఏర్పాటుచేశారు. ప్రస్తుతమున్న బలగాలకు అదనంగా 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు మోహరించనున్నారు. ఇప్పటికే 20 కంపెనీల పారామిలిటరీ బలగాలు ఏపీకి చేరుకున్నాయి. హింసాత్మక ఘటనల నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఉన్న భద్రతను రెండంచెల నుంచి మూడంచెలకు పెంచారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల భద్రత, కౌంటింగ్ ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం సీఈవో క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లనున్నారు.