Government discussion with employees: ఉద్యోగ సంఘాలతో మంత్రుల బృందం చేపట్టిన చర్చలు ముగిశాయి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో ఉన్న ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల బృందం చర్చలు జరిపింది. పెండింగ్ బకాయిలు, ఇతర సమస్యలు పరిష్కరించాలని గత కొంత కాలంగా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి. నాలుగు డీఏలు, సరెండర్ లీవులు, పదవీ విరమణ బకాయిలు చెల్లించాల్సిన అంశాలపై మంత్రులు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు.
20 వేల కోట్ల బకాయిలు: ప్రభుత్వం ఉద్యోగులకు ఎంత బకాయిలు పడిందో ఈ సమావేశం లో తెలుసుకోగలిగామని ఏపి జెఎసి అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. మార్చి నెలాఖరుకు కొన్ని బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిందన్నారు. 600 కోట్ల రూపాయలు ఏపి జీ ఎల్ ఐ బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు. సీపీఎస్ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ కూడా 2500 కోట్ల మేర చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. సరెండర్ లీవ్ బకాయిలు 2600 కోట్ల రూపాయల బకాయిలు, పోలీసులకు ఉన్న రూ. 300 కోట్లను మార్చి 31 నాటికి చెల్లిస్తామనే హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. రూ.5,600 కోట్ల మేర బకాయిలు లిస్టు సమావేశం లో ఇచ్చారని చెప్పారు. మొత్తం ఉద్యోగులకు డీఏ బకాయిలు 7500 కోట్ల రూపాయల మేర ఉందని, వెరసి ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు పడిన మొత్తం రూ.20 వేల కోట్లుగా ఉందని వెల్లడించారు. ఆఫీసు నిర్వహణ, ప్రోటోకాల్, 2019 ఎన్నికల బడ్జెట్, లీగల్ వ్యవహారాల డబ్బులు కూడా ప్రభుత్వం బకాయి పడిందని బొప్పరాజు వెల్లడించారు.
ఐదో తేదీ వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు రాలేదు : ఏపీటీఎఫ్
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులక వేతనం పెంచాలి: కాంట్రాక్టు ఉద్యోగులు క్రమబద్దికరణకు తక్షణం ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. పోస్టుల మ్యాపింగ్ కాలేదని క్రమబద్దికరణ చేయడం లేదన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనం పెంచాలని తాము కోరామన్నారు. ఉద్యోగుల ఆరోగ్య కార్డు కూడా పనిచేయడం లేదని బొప్పరాజు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ట్రస్టుకు ఇచ్చేలా ఉత్తర్వులు వచ్చినా అది అమలు కావడం లేదని చెప్పారు. మెడికల్ రీ ఎంబర్స్‌మెంట్ చేయాలని కోరామన్నారు.