Government Plan To Develop Industrial Cities Along Ports :రాష్ట్రంలో ఓడరేవుల(పోర్టు) వెంట పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మాస్టర్‌ప్లాన్ తయారుచేయించాలని ఏపీ మారిటైం బోర్డు నిర్ణయించింది. మొత్తం ఆరు పోర్టుల పరిధిలో 8 పారిశ్రామిక నగరాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించేందుకు కన్సల్టెన్సీల ఎంపిక కోసం టెండర్లు పిలవనుంది. పారిశ్రామిక నగరాల్లో గోదాములు, లాజిస్టిక్ సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉందని చెబుతున్నారు. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం, మూలపేట పోర్టుల పరిధిలో క్లస్టర్లను అభివృద్ధి చేయాలని మారిటైం బోర్డు నిర్ణయించింది.
ఆ పరిధిలో నగరాలను అభివృద్ధి : పోర్టు కేంద్రంగా చేసుకుని 100 కిలోమీటర్ల పరిధిని ప్రాక్సిమల్ ఏరియాగా నిర్ణయించింది. అయితే పోర్టు నుంచి 25 కిలోమీటర్ల పరిధిలో నగరాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. అందులో క్లస్టర్ల అభివృద్ధికి వీలుగా ప్రణాళికలు, మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. ప్రాక్సిమల్ ఏరియాగా గుర్తించిన ప్రాంతాల్లో సర్వే నిర్వహించి ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలనే దాన్ని కన్సల్టెన్సీలు ప్రతిపాదిస్తాయి. ఆ పరిధిలో భూముల లభ్యత, ఇతర అంశాలపై నివేదికలు సమర్పిస్తాయి. విశాఖపోర్టు ప్రాక్సిమల్ ఏరియాలో క్లస్టర్ అభివృద్ధి ప్రణాళికను ఏపీఐఐసీ తయారు చేయనుంది. మిగిలినచోట్ల మారిటైం బోర్డు ద్వారా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.