Govt To Implement Scrapping Policy : కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చే ప్రక్రియకు సర్కారు శ్రీకారం చుట్టింది. తాజాగా జీడిమెట్ల సమీపంలోని పాశమైలారంలో మరో ప్లాంటుకు అనుమతిని మంజూరు చేసింది. మరోవైపు ఇప్పటికే షాద్‌నగర్ సమీపంలోని కొత్తూరు, గజ్వేల్‌లో ఒక్కో ప్లాంటు చొప్పున రవాణా శాఖ అనుమతి ఇచ్చింది. ఇవి అందుబాటులో వస్తే మొత్తం ప్లాంట్ల సంఖ్య 3 చేరుతుంది.
కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు :రానున్న కొద్ది నెలల్లో మరికొన్నింటికి అనుమతి ఇచ్చేందుకు అధికారులు సన్నాహకాలు చేస్తున్నారు. వ్యక్తిగత అవసరాలకు వినియోగించే వాహనాలు రిజిస్ట్రేషన్ తేదీ నుంచి 15 ఏళ్లు, వాణిజ్య వాహనాలు 8 ఏళ్లు దాటితే కాలం చెల్లినవిగా పరిగణిస్తారు. ఆ వ్యవధి తీరిన వాహనాల నుంచి హరిత పన్ను(గ్రీన్ ట్యాక్స్) వసూలు చేస్తున్నారు. ఈ వాహనాల వల్ల కాలుష్యం పెరుగుతుండటం వల్ల వాటిని తుక్కుగా మార్చేందుకు వీలుగా నూతన విధానాన్ని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ రూపొందించింది.
దీన్ని అమలు చేసేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం గతేడాది సెప్టెంబరులో ప్రత్యేక విధానాన్ని ఆవిష్కరించింది. వాహనాలను తుక్కుగా మార్చుకుని అదే విభాగానికి చెందిన వెహికల్‌ను కొనుగోలు చేస్తే జీవితకాల పన్నులో కొద్ది మొత్తాన్ని రాయితీగా ఇస్తుంది. వాణిజ్య వాహనాలకు త్రైమాసిక, వార్షిక పన్నుల చెల్లింపులో 10 శాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.