Government Focus on Irrigation Projects in AP : జగన్ ప్రభుత్వంలో పూర్తిగా పడకేసిన సాగునీటి ప్రాజెక్టుల భవితవ్యాన్ని ఎలా రూపుదిద్దాలనే దానిపై జలవనరుల శాఖ ప్రణాళిక రూపొందించింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందగలవాటిని తొలి ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేయాలనే సంకల్పంతో ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 86 ప్రాజెక్టులూ పూర్తి చేయాలంటే లక్షా16వేల405 కోట్ల నిధులు అవసరం. ఈ క్రమంలో నిధుల కేటాయింపునకు, ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు వాటి ఫలితాలను దృష్టిలో ఉంచుకుని తాజాగా వర్గీకరించారు. వాటిలో పోలవరం సహా 6 ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం ఇచ్చారు. మరో 17 ప్రాజెక్టులు తదుపరి ప్రాధాన్యంలో ఉన్నాయి.
పోలవరం జాతీయ ప్రాజెక్టు కావడంతో కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తుందని మిగిలిన వాటికి రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. రాష్ట్ర నిధులతో చేయాల్సిన వాటిలో ఐదింటిని తొలి ప్రాధాన్యంలో పూర్తి చేస్తే 1.71 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుందని 14.01 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చని అంచనా వేశారు. 22 లక్షల మందికి పైగా జనాభాకు తాగునీటి సదుపాయం లభ్యమవుతుందన్నారు. ఇందుకు 8 వేల 734.64 కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుందని తేల్చారు.
వైఎస్సార్సీపీ సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేసింది - మేము ప్రాధాన్యతిస్తున్నాం: మంత్రి నిమ్మల - Nimmala About Srisailam Project
ఖరీఫ్‌కు నీళ్లు ఇవ్వాలనే లక్ష్యం : వంశధార రెండో భాగం రెండోదశ పనులకు 134.12 కోట్లు అవసరమని, ఇది పూర్తి చేస్తే 12 వేల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుందని, 2.30 లక్షల ఎకరాలు స్థిరీకరణ సాధ్యమవుతుందని అధికారులు తేల్చారు. 2025 జూన్‌కే పూర్తి చేసి ఖరీఫ్‌కు నీళ్లు ఇవ్వాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. వెలిగొండ తొలిదశకు 1,422.92 కోట్లు అవసరమని, 1.19 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగవుతుందని అంచనా వేశారు. 4 లక్షల మందికి తాగునీరు అందుతుందని, మొత్తంగా 2027 నాటికి దీనిని పూర్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు.
2028 జూన్ నాటికి పూర్తి :చింతలపూడి ఎత్తిపోతల తొలి దశలో 2వేల కోట్లు ఖర్చు చేస్తే 50 వేల ఎకరాల కొత్త ఆయకట్టు సాగవుతుందని లెక్కగట్టారు. 2.10 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 14 లక్షల మందికి తాగునీరు అందించవచ్చని, 2026 జూన్ నాటికి తొలిదశ పూర్తి చేయాలనే ప్రణాళికలు వేశారు. చింతలపూడి రెండోదశకు 2వేల 465 కోట్లు అవసరమని అంచనా వేశారు. దీని వల్ల 1.50 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందుతుందని 70 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు 12 లక్షల మందికి తాగునీరు ఇవ్వవచ్చని లెక్కగట్టారు. 2028 జూన్ నాటికి పూర్తి చేయాలనేది ప్రణాళిక.
వైఎస్సార్సీపీ నిర్లక్ష్యంతో గాల్లో దీపంలా మారిన సాగునీటి ప్రాజెక్టులు - తట్టమట్టి కూడా తీయించిందేలే! - YSRCP Govt Neglect Water Projects
4 లక్షల మంది జనాభాకు తాగునీరు :గోదావరి పెన్నా అనుసంధానానికి 5వేల 3 కోట్లు అవసరమని అంచనా వేసిన అధికారులు 9.61 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చని తేల్చారు. 2026 జూన్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. హంద్రీనీవాలో కుప్పం బ్రాంచి కాలువకు, పుంగనూరు బ్రాంచి కాలువకు నీళ్లు ఇవ్వాలనేది లక్ష్యం. ఇందుకు పుంగనూరు బ్రాంచి కాలువ పనులు పూర్తి చేసేందుకు 117 కోట్లు కావాలి. 37 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుందని అంచనా వేశారు. కుప్పం బ్రాంచి కాలువ పనుల పూర్తికి 66.86 కోట్లు అవసరమని, 6వేల300 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు 4 లక్షల మంది జనాభాకు తాగునీరు అందుతుందని, 2024 అక్టోబరు నాటికే ఈ రెండు పనులూ పూర్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు.
సెప్టెంబరు 15 నాటికి పూర్తి :పోలవరం పనులను అంతర్జాతీయ నిపుణుల కమిటీ సిఫార్సుల ప్రకారం పట్టాలకు ఎక్కిస్తారు. ఎడమ కాలువలో మిగిలిన పనులకు టెండర్ల ప్రక్రియను సెప్టెంబరు 15 నాటికి పూర్తి చేయాలని నిర్దేశించుకుంది. ప్రాధాన్య క్రమంలో మరో 17 ప్రాజెక్టులకు 34వేల 286.89 కోట్లు అవసరమని జలవనరులశాఖ అంచనా వేసింది.
ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు నిధులు - సర్కార్ ప్రణాళికలు - World Bank on Irrigation Projects