Government Towards Road Construction in Tribal Areas in AP :రాష్ట్రాన్ని డోలీ మోతల రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దశల వారీగా మారుమూల గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తొలి దశలో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 9 రోడ్ల నిర్మాణం చేపట్టాల్సిందిగా అధికారులకు సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. గిరిజన గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానించేందుకు దాదాపు 50 కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
New Roads to Remote Villages in AP : దేశం సాంకేతికంగా ఎంతో ఎదిగినా రాష్ట్రంలో ఇప్పటికీ కొన్ని గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేదు. కొండలపై విసిరేసినట్లుగా ఉండే గిరిజన గ్రామాల్లో అత్యవసర పరిస్థితులు తలెత్తితే డోలీపై మోసుకెళ్లాల్సిందే. సకాలంలో వైద్యం అందక కొంత మంది మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయి. డోలీ మోతల కష్టాల నుంచి గిరిజనులను గట్టెక్కించడంపై ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. మారుమూల గిరిజన గ్రామాల నుంచి సమీపంలోని ప్రధాన రహదారులను కలిపేలా రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు.