ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"భారత్ భవిష్యత్ బాగుండాలి - ఆ విజయంలో ఏపీ ప్రధాన పాత్ర కావాలి" - విశ్వాసం పెంచిన డ్రోన్ సమ్మిట్ - DRONE INDUSTRY FUTURE

డ్రోన్‌ టెక్‌ నవ ఆవిష్కరణలకు గొప్ప ముందడుగు - డ్రోన్‌ రంగ భవిష్యత్తుపై తయారీదార్లలో పెరిగిన విశ్వాసం

govt_aim_is_to_make_state_as_drone_hub
govt_aim_is_to_make_state_as_drone_hub (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 24, 2024, 9:31 AM IST

Government Aim Is To Make State As Drone Hub :రాష్ట్రాన్ని డ్రోన్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహించిన అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌ విజయవంతంగా సాగింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమ్మిట్‌ పలు వినూత్న ఆవిష్కరణలతో పాటు ప్రపంచ రికార్డులు సృష్టించి సరికొత్త చరిత్ర లిఖించింది. రాష్ట్రంలో డ్రోన్‌ టెక్‌ నవ ఆవిష్కరణలకు గొప్ప ముందడుగు పడింది. డ్రోన్‌ రంగ భవిష్యత్తుపై తయారీదార్లలో విశ్వాసం పెరిగింది. సదస్సుని విజయవంతం చేసిన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు తెలిపింది.

Guntur District Mangalagiri Drone Summit-2024 Was Successful : గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన డ్రోన్‌ సమ్మిట్‌ -2024 దిగ్విజయంగా ముగిసింది. డ్రోన్‌ టెక్నాలజీ అభివృద్ధి చేయడంలో ప్రస్తుతం ఉన్న సవాళ్లను ఎదుర్కొనేలా సమ్మిట్‌లో మేధోమథనం జరిగింది. డ్రోన్ల రంగ నిపుణులు, ప్రభుత్వ అధికారులతో కూడిన ప్యానళ్లు విస్తృతంగా చర్చలు జరిపాయి. ఐఐటీ మద్రాస్‌ డిఫెన్స్‌ డ్రోన్స్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ హెచ్​ఎస్​ఎన్​ (HSN) మూర్తి ఆధ్వర్యంలో వార్‌ఫెర్‌ విత్‌ ఇండీజినస్ డ్రోన్‌ అండ్‌ యాంటీ డ్రోన్‌ టెక్నాలజీస్‌పై ప్రభావవంతమైన చర్చ జరిగింది.

హంచ్‌ మొబిలిటీకి చెందిన అమిత్‌ దత్తా నేతృత్వంలో భారతీయ డ్రోన్‌ రంగంలో పెట్టుబడుల పరంగా సవాళ్లపైనా చర్చించారు. రెడ్వింగ్‌ ల్యాబ్స్‌ కో - ఫౌండర్‌ అన్షుల్‌ శర్మ ఆధ్వర్యంలో ఆరోగ్య రంగంలో ఏరియల్‌ మెడికల్‌ సపోర్ట్‌, డ్రోన్‌ అంబులెన్సులు వంటి విషయాలపై చర్చ జరిగింది. రాష్ట్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జె.నివాస్‌, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ జి. లక్ష్మీషా చర్చల్లో పాల్గొన్నారు.

రోడ్లపై గుంతలను డ్రోన్లు లెక్కిస్తాయా? - గుంపులో దాగిన నేరస్థుల్ని గుర్తిస్తాయా? - ఆసక్తి రేపుతోన్న చంద్రబాబు ప్రశ్నలు

డ్రోన్‌ టెక్నాలజీస్‌ ద్వారా ప్రభుత్వం సేవలను ప్రజలకు చేరవయడం, డ్రోన్‌ సాంకేతికతల అభివృద్ధి తీసుకుంటున్న చర్యలను వివరించారు. స్టార్టప్‌ల ఫండింగ్‌కు అమలవుతున్న విధానాలను వివరించారు. డిజిటల్‌ భూ రికార్డుల రూపకల్పనలో డ్రోన్‌ సాంకేతికత వినియోగంపై ప్రకాశం జిల్లా జేసీ రోణంకి గోపాలకృష్ణ కీలక ప్రసంగం చేశారు. డ్రోన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ స్మిత్‌ షా నేతృత్వంలో డ్రోన్‌ రంగానికి అవసరమై నైపుణ్యవంతులైన మానవ వనరుల అభివృద్ధిపై చర్చ జరిగింది.

ఇటీవల విజయవాడ వరదల సమయంలో బాధితులకు ప్రభుత్వం అందించిన సహాయక చర్యల్లో డ్రోన్ల వినియోగం విజయవంతం కావడంపై కీలక పీపీటీ ప్రజెంటేషన్‌ చేశారు. వరద మ్యాపింగ్‌, పర్యవేక్షణ, ముంపు నష్టాల సత్వర అంచనా, ఆహారం, ఇతర సామగ్రి సరఫరా, పారిశుద్ధ్య కార్యకలాపాల్లో డ్రోన్ల వినియోగించిన తీరుని వివరించారు. 437 డ్రోన్లు, 846 మంది సిబ్బంది, 4 వేల 73 ట్రిప్పుల ద్వారా ప్రజలకు అందించిన సేవలను తెలిపారు.

రాష్ట్ర నలుమూలల నుంచి డ్రోన్లు తయారు చేసిన కంపెనీలతో పాటు విద్యార్థులు పెద్దఎత్తున సమ్మిట్‌లో పాల్గొన్నారు. వ్యవసాయ, వైద్య రంగాల్లో వినియోగించే డ్రోన్స్‌ని యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేసి ప్రదర్శనకు ఉంచారు. ఆక్టోపస్‌ డీఐజీ, పలువురు పోలీసు ప్రతినిధులు సమ్మిట్‌కు హాజరై మావోయిస్టుల ఏరివేతలో డ్రోన్స్‌ పాత్రని వివరించారు. డ్రోన్స్‌పై పరిశోధన చేసే సంస్థ నెలకొల్పితే రాష్ట్రానికి ప్రపంచస్థాయి గుర్తింపు లభిస్తుందని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు.

సమ్మిట్‌తో డ్రోన్‌ టెక్‌ నవ ఆవిష్కరణలకు గొప్ప ముందడుగు పడిందని వచ్చే ఐదేళ్లలో ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు. డ్రోన్‌ తయారీదారుల్లో విశ్వాసం పెరిగిందని ఈ క్రమంలో పరిశోధన, అభివృద్ధి, డ్రోన్‌ యూజ్‌ కేసుల రూపకల్పన, వివిధ రంగాల్లో వినియోగంలో గణనీయ అభివృద్ధి సాధ్యపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యువ భారత్‌లో మేథస్సుకు కొదవలేదనిపెట్టుబడుల సవాళ్లను ఎదుర్కొనేలా స్టార్టప్‌లను ప్రోత్సహించేలా ప్రభుత్వం కృషి చేస్తుందనే భరోసా లభించిందంటున్నారు.

సదస్సులో భాగస్వాములైన వారికి రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయల శాఖ కార్యదర్శి సురేష్‌ కుమార్‌, ఏపీ డ్రోన్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌, ఎండీ దినేష్‌ కుమార్‌ ధన్యవాదాలు తెలిపారు. విజయవంతం చేసిన సిబ్బంది, పలువురు టెక్నాజీ నిపుణులు, పెట్టుబడిదారులను ప్రభుత్వం తరఫున ఘనంగా సన్మానించారు.

అమరావతి డ్రోన్​ షో అదుర్స్​ - ఐదు గిన్నిస్​ రికార్డులు

ABOUT THE AUTHOR

...view details