Good Message to Palnadu People Through Facebook :పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో సింహభాగం పల్నాడు జిల్లావే. దీంతో న్యూస్ పేపర్లు, వార్తా ఛానెళ్లు, సామాజిక మాధ్యమాల్లో పల్నాడు జిల్లాలో జరుగుతున్న అల్లర్ల గురించి అందరికీ తెలుస్తోంది. వేర్వేరు రాష్ట్రాల్లో, ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన పల్నాడు వాసులు కొందరు తమ చిన్నతనంలో జరిగిన ఘటనలను గుర్తు చేసుకుంటున్నారు. అందులో ఒకరు ఫేస్‌బుక్‌లో తను చిన్నప్పుడు ఏం జరిగిందో చెబుతూ రాజకీయ నాయకుల స్వార్థాలకు బలి కావొద్దని హితవు పలుకుతున్న సందేశం ఎందరినో ఆలోచింపజేస్తోంది. ఆయన మాటల్లోనే.
'ఇప్పుడు పల్నాడు జిల్లాలో జరుగుతున్న అల్లర్లు చూస్తే మా ఊరి గతం గుర్తొస్తోంది. 1995-96 సమయంలో ఇంత కంటే ఎక్కువగానే జరిగాయి. మండల పరిషత్ ఎన్నికలతో మొదలైన గొడవలు చాలా రోజులు నడిచాయి. మొదట్లో వీరావేశంతో బాంబులు వేసిన వాళ్లను హీరోలుగా చూశాం. బడులు ఎగ్గొట్టి ఆడుకున్నాం. మేము తోపులం అని ఒక్కొక్కరు కథలు చెబుతుంటే అలా ఉండాలి అనిపించేది. కానీ తర్వాత ఒక్కొక్కరి మీద కేసులు పెట్టాక చిన్నగా బాధ ప్రారంభమైంది. తర్వాత గొడవలు ప్రారంభమయ్యాయి. పంతాలు పెరిగాయి. రోజూ ఏదో గొడవ జరుగుతుండేది. స్వేచ్ఛగా తిరగలేకపోయేవారు. కొట్లాటలో కొంతమంది చేతులు, కాళ్లు విరిగాయి. కొంతమంది తలలు పగిలాయి. కొందరి ప్రాణాలు పోయాయి. పోలీసులు ఇళ్లలో సోదాలు చేసేవాళ్లు. అందరూ ఊరి చివర తోటల్లో ఉండేవాళ్లు. వాళ్లకు భోజనాలకు బాగా ఇబ్బందిగా ఉండేది. ఇళ్లలో ఆడవాళ్లూ బాగా ఇబ్బంది పడేవారు. పశువులకు మేత తేవడం కూడా కష్టమయ్యేది. దీంతో చాలామంది పశువులనూ అమ్మేసుకున్నారు. పదో తరగతి పాసైనవారి నుంచి డిగ్రీ చేసినవాళ్ల వరకూ ఈ గొడవల్లో పడి జీవితాలు నాశనం చేసుకున్నారు. మంచి ఉద్యోగాలు దొరక్క, చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాలతో సరిపెట్టుకున్నారు. కేసులతో, వాయిదాలతో చాలా కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నం అయ్యాయి. మనిషి ముందు హీరోలా చూసినా వెనుక మాత్రం రౌడీ, దుర్మార్గుడు అనుకునేవాళ్లు. ఒక తరమంతా ఇలా నాశనమైంది. ఊరి పేరు చెబితే పెళ్లి సంబంధం కూడా వచ్చేది కాదు. ఎటు చూసినా నష్టమే. రాజకీయ నాయకుల కోసమే మన జీవితాలు నాశనం అయ్యాయి. పల్నాటి కుర్రోళ్లకు ఒకటే చెబుతున్నా. గొడవలు పడకండి. ఈ రోజు మా ఊళ్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మీరు కొట్టుకొని నష్టపోకండి. ఇదీ మా ఊరి అనుభవం. మా ఊరు రొంపిచర్ల.'