Good Days for AP Capital Amaravati :ఆంధ్రుల కలల ప్రజా రాజధాని అమరావతికి మంచి రోజులు వచ్చాయి. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని నగరంగా 2015లో అమరావతి పురుడు పోసుకుంది. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ప్రపంచ స్థాయి నగరంగా అమరావతికి.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రూపకల్పన చేశారు. పరిపాలనా నగరంతో పాటు ఆర్థిక, న్యాయ, వైద్య, క్రీడ, సాంస్కృతిక, ఎలక్ట్రానిక్స్, పర్యాటక, విద్యా, వైజ్ఞానికం అంటూ నవ నగరాల నిర్మాణాలకు చోటు కల్పించారు. 217 చదరపు కిలోమీటర్లలో తొలి దశలో 58 వేల కోట్ల రూపాయల అంచనాలతో రాజధాని నిర్మాణ పనులు చేపట్టారు.
వైఎస్సార్సీపీ నాయకులు కేసులు పెట్టినా వాటిని అధిగమించి పనులు శరవేగంగా ముందుకు తీసుకెళ్లారు. కేవలం 6 నెలల్లోనే 6 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో సచివాలయం, అసెంబ్లీ భవనాలు అందుబాటులోకి తెచ్చి అక్కడి నుంచే పరిపాలన ప్రారంభించారు. మరోవైపు అనతికాలంలోనే నిధులు సమకూర్చుకుంటూ అమరావతి ఒక బ్రాండ్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. అయితే 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే అప్పటి వరకు పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరులా మారింది. మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతిలోని పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ రైతులు ఐదేళ్లుగా పట్టు వదలని విక్రమార్కుల్లా పోరాడుతూ వచ్చారు. ఈ ఎన్నికల్లో కూటమి గెలుపుతో రాజధాని రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి.
సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం - హాజరు కానున్న ప్రధాని మోదీ - Chandrababu Oath Ceremony as CM
అమరావతి రూపకర్త చంద్రబాబు సారథ్యంలోనే అమరావతికి పూర్వ వైభవం సంతరించుకుంటుందని రాజధాని రైతులు విశ్వాసంతో ఉన్నారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వ యంత్రాంగమూ అడుగులు వేస్తోంది. 3 రోజులుగా జంగిల్ క్లియరెన్స్ పనులు జరుగుతున్నాయి. రాజధానిలోని రహదారుల వెంట పెరిగిన కంపచెట్లను జేసీబీలతో తొలగించారు. రాజధాని సీడ్‌యాక్సిస్ రహదారిపై ఉన్న 2 వేల లైట్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించారు. దీంతో రాత్రి వేళ సీడ్‌యాక్సిస్ రహదారిపై విద్యుత్ దీపాలు మిరుమిట్లు గొలుపుతున్నాయి.