Heavy Water Flow In Godavari :ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదనీటి ఉద్ధృతికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం సాయంత్రానికి గోదావరి నీటిమట్టం 53.6 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53 అడుగులు దాటడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో అధికారులు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు వరదనీటి కారణంగా జనజీవనం స్తంభించింది.
పునరావాస కేంద్రాలకు తరలింపు :గోదావరి నీటిమట్టం పెరగడంతో పట్టణంలోని ఏఎంసీ ప్రాంతంతోపాటు , కొత్త కాలనీల్లోకి వచ్చే మురుగునీరు గోదావరిలో కలవడానికి వెళ్లే పరిస్థితి లేక కాలనీల్లోకి వరదనీరు చేరింది. దీంతో జనజీవనం స్తంభించింది. సుమారు 80 కుటుంబాలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కాలనీల్లోని సుమారు 400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. నీటిమట్టం పెరగడం వల్ల భద్రాచలం నుంచి వివిధ మండలాలకు ప్రయాణాలు నిలిచిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది.
వరద బాధితుల బాధలు వర్ణణాతీతం :భద్రాచలం నుంచి దుమ్ముగూడెం మండలం చర్ల మండలంలోని ముంపు ప్రభావిత ప్రాంతాలైన కునవరం, చింతూరు, కుకనూరు, వెలెరుపాడు మండలాలకు రవాణా నిలిచిపోయింది. విలీన మండలాల్లోని చాలా గ్రామాలు గత వారంరోజులుగా వరద ముంపులోనే ఉన్నాయి. పట్టణ ప్రాంతాలకు రాకపోకలు లేక నిత్యావసరాలకు వరద బాధితులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటి వల్ల ఇంకా కొంతమేర నీటిమట్టం పెరగవచ్చని కేంద్ర జలవనులశాఖ అధికారులు అంచనావేస్తున్నారు.