ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాపట్ల జిల్లాలో విషాదం - వాగులో మునిగి తండ్రీకుమారుల మృతి - మరో ఇద్దరు గల్లంతు - Four Youths Died in River - FOUR YOUTHS DIED IN RIVER

Four Youths Drowned in river at Bapatla Districtl: సరదాగా కుటుంబంతో గడుపుదామని వచ్చిన వారి విహారయాత్ర విషాదంగా మారింది. వేసవి నుంచి ఉపశమనం పొందడం కోసం వారంతా హైదరాబాద్‌ నుంచి బాపట్ల వచ్చారు. వాగులో స్నానం చేస్తుండగా నలుగురు గల్లంతయ్యారు. వారిలో తండ్రీ కుమారుల మృతదేహాలు లభ్యం కాగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. పిల్లలతో కలిసి సరదాగా గడుపుదామని వచ్చిన వారు ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబసభ్యులు గుండెలుపగిలేలా రోదిస్తున్నారు.

FOUR YOUTHS DIED IN RIVER
FOUR YOUTHS DIED IN RIVER (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 29, 2024, 4:13 PM IST

Updated : May 30, 2024, 8:51 AM IST

బాపట్ల జిల్లాలో విషాదం - వాగులో స్నానానికి దిగి నలుగురు యువకులు గల్లంతు (ETV Bharat)

Four Youths Drowned in river at Bapatla Districtl:బాపట్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వేసవి సెలవులను పిల్లలతో కలిసి సరదాగా గడుపుదామని బాపట్ల జిల్లాకు వచ్చిన హైదరాబాద్‌ వాసుల విహారయాత్ర విషాదంగా మారింది. స్థానిక నల్లమడ వాగులో స్నానం చేస్తుండగా మునిగిపోతున్న కుమారుడిని కాపాడేందుకు వెళ్లిన తండ్రి, వారిని రక్షించడానికి ప్రయత్నించిన మరో ఇద్దరు బంధువులు సైతం గల్లంతయ్యారు. వారిలో తండ్రీకుమారుల మృతదేహాలు లభ్యం అయ్యాయి.

హైదరాబాద్‌ జగద్గిరిగుట్ట బీరప్పనగర్‌కు చెందిన దరబడి సునీల్‌కుమార్, ఆయన భార్యా పిల్లలు, బంధువులు బండా నందు, శ్రీనాథ్, వారితో పాటు ఈసీఐఎల్‌ సమీపంలోని నాగారానికి చెందిన వడ్లకొండ కిరణ్‌ కుటుంబసభ్యులతో కలిసి మొత్తం 12 మంది ఆదివారం బాపట్ల జిల్లాకు వచ్చారు. స్థానికంగా ఉన్న బంధువులను కలవడంతో పాటు సూర్యలంక బీచ్‌కు వెళ్దామని అంతా నిర్ణయించుకున్నారు. అయితే తొలుత పొన్నూరు మండలం వడ్డిమక్కులలో బంధువుల ఇంటికి వెళ్లి, సరదాగా 2 రోజులు గడిపారు. తరువాత బుధవారం ఉదయం మునిపల్లెలో మరో బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి పర్చూరు మండలం వీరన్నపాలేనికి బయలుదేరారు. మార్గమధ్యలో బాపట్ల పట్టణ శివారులోని నల్లమడ వాగు కనిపించింది. దీంతో వారంతా నల్లమడ వాగు వద్ద ఆగారు.

ఒకరి వెంట మరొకరు మృత్యుఒడిలోకి..

కొంతసేపు సేదదీరాక స్నానం చేద్దామని వాగులో దిగారు. అయితే ఆ వాగు ప్రమాదమని వారికి తెలియదు. అక్కడ హెచ్చరిక బోర్డులు లేకపోవటంతో సుడిగుండాల్లో చిక్కుకున్నారు. వాగులో స్నానం చేయడానికి నందు కుమారుడు బిట్టు, సునీల్‌కుమార్‌ కుమారుడు సన్నీ, శ్రీనాథ్ దిగారు. శ్రీనాథ్, బిట్టు స్నానం చేసి కాసేపటికి ఒడ్డుకు వచ్చారు. పోటు ప్రభావంతో సముద్రంలోని నీరు వాగులో చేరి, ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగునీటిలో టైర్‌ ట్యూబ్‌ను పట్టుకుని సన్నీ(13) ఎగురుతుండగా అదుపుతప్పి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.

దీంతో ఒడ్డున ఉన్న తండ్రి సునీల్‌కుమార్‌(36) వాగులోకి దిగారు. కొట్టుకుపోతున్న సన్నీని కాపాడే ప్రయత్నంలో తండ్రి సునీల్‌కుమార్‌ ప్రవాహంలో చిక్కుకున్నాడు. వారిద్దరిని కాపాడదామని కిరణ్‌(35), నందు(35) వెళ్లి వారూ గల్లంతయ్యారు. సుడిగుండాలు ఎక్కువగా ఉండటంతో నలుగురు బయటకు రాలేకపోయారు. స్థానిక మత్స్యకారులు స్పందించి గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలించారు.

గంటన్నర గాలింపు తర్వాత:సమాచారం తెలుసుకుని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన గంటన్నర సమయం తర్వాత సుమారు 500 మీటర్ల దూరంలో సునీల్‌కుమార్, సన్నీ మృతదేహాలు కనిపించాయి. భర్త, కుమారుడి మృతదేహాలను చూసి భార్య కోటేశ్వరి గుండెలవిసేలా రోదించారు. నల్లమడ వాగులో గల్లంతైన నందు, కిరణ్‌ల ఆచూకీ కోసం రాత్రి 7 గంటల వరకు గాలించారు. తర్వాత చీకటి పడటంతో అధికారులు గాలింపు నిలిపేశారు.

నల్లమడ వాగులో స్నానం ప్రమాదకరం:నల్లమడ వాగు నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో పాటు లోతు ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా సముద్రం నుంచి నీరు వాగులోకి ఎదురు ప్రవహిస్తుంది. వాగులో నీటి సుడిగుండాలు, లోతైన గుంటలు ఎక్కువగా ఉన్నాయి. ఈత వచ్చిన వారు సైతం సుడిగుండాలు, గుంతలు ఉన్న ప్రాంతంలో నీటిలో దిగటం చాలా ప్రమాదకరం. వేసవి విహారానికి హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి అనేక మంది బాపట్ల, చీరాల తీర ప్రాంతాలకు వస్తున్నారు. సూర్యలంక, రామాపురం బీచ్‌లు వేల మంది పర్యాటకులతో కిక్కిరిసిపోతున్నాయి. వీరికి పొంచి ఉన్న ప్రమాదాలు వివరిస్తూ, అవగాహన కల్పిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

నీళ్లలో దూకమని ఎంకరేజ్ చేసిన ఫ్రెండ్స్ - మద్యం మత్తులో దూకిన యువకుడు, కళ్లముందే మునిగిపోతున్నా - Hyd YOUNG man died in Karnataka

మాటువేసి చెరువులోకి తోసి- మహిళల మృతి కేసులో వీడిన మిస్టరీ - Three Womens Murder Case

Last Updated : May 30, 2024, 8:51 AM IST

ABOUT THE AUTHOR

...view details