Missing Girls Rescued by Vijayawada Police: విజయవాడలో నలుగురు మైనర్ బాలికల అదృశ్యం తీవ్ర కలకలం రేపింది. అజిత్‌సింగ్ నగర్‌లోని కొత్త రాజరాజేశ్వరిపేటకు చెందిన ముగ్గురు మైనర్‌బాలికలు అదృశ్యం అయినట్లు రాత్రి 11 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు అందింది. మరో ఘటనలో వీళ్లకు సంబంధం లేని మరో అమ్మాయి కూడా కనిపించడం లేదని ఫిర్యాదు వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కి పడిన పోలీసులు వేగంగా దర్యాప్తును ప్రారంభించారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నలుగురు అమ్మాయిల కోసం గాలింపు చేపట్టారు.
కుటుంబ సభ్యుల నుంచి మైనర్ బాలికల వివరాలను సేకరించిన పోలీసులు, సోషల్ మీడియా ప్రభావంతోనే బాలికలు అదృశ్యం అయినట్లు గుర్తించారు. అదృశ్యం అయిన అమ్మాయిల్లో ముగ్గురికి దగ్గర బంధుత్వం ఉన్నట్లు తెలుసుకున్నారు. ఇన్‌స్టాగ్రాంలో పరిచయం చేసుకున్న ఆగంతుకులే ఈ ముగ్గురు మైనర్ బాలికలను ఏక కాలంలో ప్రలోభపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వేగంగా పావులు కదిపిన పోలీసులు గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని ఓ ప్రాంతంలో ముగ్గురు అమ్మాయిలను గుర్తించారు. వీరితో పాటు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. బాలికలను తెనాలి నుంచి ఇతర ప్రాంతానికి తరలించే ఏర్పాట్లను ఆ ఇద్దరు యువకులు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మైనర్ బాలికలను తమ అదుపులోకి తీసుకున్న పోలీసులు, శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఆ బాలికలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం అదుపులోకి తీసుకున్న ఇద్దరు వ్యక్తుల నుంచి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అమ్మాయిలను విజయవాడ నుంచి బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు యత్నించినట్లు జరుగుతున్న ప్రచారంపై తాము దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ స్రవంతిరాయ్ తెలిపారు. అజిత్‌సింగ్‌నగర్ ప్రాంతంలోనే మరో బాలిక అదృశ్యమైనట్లు వచ్చిన ఫిర్యాదుపై కూడా గంటల వ్యవధిలోనే ఆ బాలిక ఆచూకి గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.