Rapido Story:ర్యాపిడో గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ర్యాపిడో సమాజంలో విస్తృతమైన ఆదరణను చూరగొంది. అతి చిన్న అంకుర సంస్థగా ముగ్గురు వ్యక్తులతో మొదలైన ర్యాపిడో నేడు దాదాపు చాలా నగరాల్లో తన సేవలను అందిస్తుందంటే అది ప్రజలకు ఎంతలా చేరువైందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం మహా నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు అంతటా దీని జైత్రయాత్ర కొనసాగుతోంది. ఉపాధి కోసం చూసే ఎంతో మంది నిరుద్యోగులకు ఇది బాసటగా నిలుస్తోంది. అయితే ఇటీవల ర్యాపిడో మరో ఘనతను అందుకుంది. ఆన్‌లైన్ ట్రాన్స్‌పోర్ట్ స్టార్టప్‌గా మొదలై తాజాగా యూనికాన్ సంస్థగా అవతరించింది. దీని ద్వారా మరిన్ని సేవలను వినియోగదారులకు అందించే అవకాశం ఉంటుంది.
ప్రయోజనాలు: దీని వల్ల కేవలం సేవలందించడమే కాకుండా వేలమంది ఉపాధికి కల్పించే సంస్థగా రూపాంతరం చెందుతోంది. యూనికాన్ సంస్థ భాగస్వామ్యంతో ప్రస్తుతం ఈ సంస్థ 125 నగరాల్లో దాదాపు 30 లక్షల మంది ఉద్యోగులతో దిగ్విజయంగా విరాజిల్లుతోంది. దీని ద్వారా ర్యాపిడో ప్రయాణ రంగంలో సైతం ప్రవేశించి కోట్లాది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. అయితే ఇటువంటి వినూత్నమైన ఆలోచనలకు శ్రీకారం చుట్టిన ముగ్గురిలో ఒకరైన రిషికేశ్ సంస్థ అభివృద్ధిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ర్యాపిడో నెలకొల్పే సమయంలో తమ వద్దనున్న పరిమిత ఆదాయంతో దీన్ని నెలకొల్పినట్లు అతను వెల్లడించారు. అయితే వారికి ఈ ర్యాపిడో ఆలోచన ఎలా ఉత్పనమయ్యింది? ర్యాపిడో ఎలా ప్రారంభమైంది? భవిష్యత్తు లక్ష్యాలేంటో వ్యవస్థాపకుల్లో ఒకరైన రిషికేశ్ మాటల్లో విందాం.