ACB And Ed inquiries On Formula E Race Case : సంచలనం రేపుతున్న ఫార్ములా - ఈ రేసు కేసులో వేర్వేరు దర్యాప్తు సంస్థల ఎదుట హాజరైన నిందితులు ఇద్దరూ తాము ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే నడుచుకున్నామని చెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో తమ పాత్ర ఏమీలేదని, నిబంధనల ఉల్లంఘన కూడా జరగలేదని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నాటి ఎంఏయూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్‌ఎండీఏ పూర్వ కమిషనర్ అర్వింద్ కుమార్‌ను అనిశా, విశ్రాంత చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం ప్రశ్నించారు. వారిద్దరి వాంగ్మూలాలు నమోదు చేశారు.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే నడుచుకున్నాం : స్పాన్సర్‌గా ఉన్న ఏస్ నెక్స్ట్‌జెన్ సంస్థ అర్ధాంతరంగా వైదొలగడం దగ్గర నుంచి, ఫార్ములా ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈవో)కు హడావుడిగా నిధులు బదిలీ చేయడం వరకూ జరిగిన అనేక అంశాలపై అర్వింద్‌కుమార్ నుంచి అనిశా అధికారులు సమాధానాలు రాబట్టారు. ఉదయం 10 గంటల సమయంలో అనిశా కార్యాలయంలోకి వెళ్లిన ఆయనను మధ్యలో భోజన విరామం మినహా సాయంత్రం 4 గంటల వరకూ ప్రశ్నించారు. రేసుల నిర్వహణకు సంబంధించి ప్రతి విషయం మంత్రిత్వ శాఖకు తెలుసని ఆయన చెప్పినట్లు సమాచారం.
ఫార్ములా-ఈ రేసు కేసు విచారణ : ఏస్‌నెక్స్ట్‌జెన్ ఒప్పందానికి విరుద్ధంగా వైదొలగడంతో ప్రభుత్వం నిధులు చెల్లించాల్సి వచ్చిందని, ఆ సంస్థపై ఎందుకు చర్యలు చేపట్టలేదని అధికారులు అడిగారని సమాచారం. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తాను ప్రభుత్వానికి సూచించానని ఆయన సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రి మండలి ఆమోదం లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి తీసుకోకుండానే నిధులు ఎలా చెల్లించారని అడగ్గా, మంత్రిమండలి ఆదేశాల ప్రకారమే నిధులు విడుదల చేశామని, రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధం లేదు కాబట్టి ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదని ఆయన వివరించినట్లు సమాచారం.
మరో స్పాన్సర్‌ను వెతికేందుకు ప్రయత్నాలు జరిగాయని, సమయాభావం వల్ల వీలుపడలేదని చెప్పినట్లు తెలుస్తోంది. అధికారులుగా తాము సొంత నిర్ణయాలు తీసుకోలేదని, మంత్రిత్వశాఖ చెప్పినట్లే నడుచుకున్నామని, అన్ని విషయాలు ఎప్పటికప్పుడు బాధ్యులకు చెబుతూనే ఉన్నామని అర్వింద్‌కుమార్ స్పష్టం చేసినట్లు సమాచారం.