కోర్టు ఆవరణలో మాజీ ఎమ్మెల్యే వంశీ అనుచరుల దౌర్జన్యం - టీడీపీ నేతలపై దాడి Former MLA Vallabhaneni Vamsi Followers Threatened :కోర్టు ఆవరణలోనే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. కేసు విచారణ కోసం గన్నవరం టీడీపీ, వైసీపీ నేతలు కోర్టుకు వచ్చారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేత యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkata Rao) వర్గం నాయకులను వంశీ వర్గీయులు అడ్డుకున్నారు. నెల రోజుల్లో అందరనీ ఏరి పారేస్తామంటూ బెదిరింపులులకు దిగారు. ఇప్పటికే ఆలస్యం అయిందని, ఇక ఊరుకునేది లేదంటూ హెచ్చరించారని యర్లగడ్డ వెంకట్రావు వర్గీయులు తెలిపారు. గతంలో వంశీ (Vallabhaneni Vamsi)తో తిరిగిన తమనే బెదిరిస్తారా అని వెంకట్రావు వర్గీయులు నిలదీశారు.
అయితే బెదిరించిన వారిని కాకుండా వెంకట్రావు వర్గీయులపై పోలీసులు చర్యలకు దిగారు. మాజీ ఎమ్మెల్యే వంశీ ఆదేశాలతో వెంకట్రావు వర్గీయులను సూర్యారావుపేట పోలీస్టేషన్‌కి తరలించారు. చంపుతామని బెదిరించిన వారిని వదిలి, తమను ఎందుకు స్టేషన్‌కి తీసుకొచ్చారని టీటీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకుని గన్నవరం నుంచి బయలుదేరి యార్లగడ్డ వెంకట్రావు, ఇతర టీడీపీ నాయకులు సూర్యాపేటపేట పోలీస్టేషన్‌కు చేరుకున్నారు. చంపుతామని బెదిరించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తమ ప్రాణాలను వారి నుంచి రక్షణ కల్పించాలని సీపీకి టీడీపీ నేతలు విజ్ఞప్తి చేశారు.
రంగబాబుపై దాడి ఎమ్మెల్యే వంశీ అనుచరుల పనే - వీడియో విడుదల చేసిన యార్లగడ్డ వెంకట్రావు
పోలీసుల తీరుపై యార్లగడ్డ వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరించిన వారిని కాకుండా, దెబ్బలు తిన్న బాధితులను స్టేషన్లో పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ వారిని విడుదల చేయాలంటూ అంబేడ్కర్ విగ్రహం ఎదుట బైఠాయించేందుకు యత్నించిగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఫిర్యాదు మేరకు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారుల హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించి పోలీస్టేషన్‌కు వచ్చారు. తమ వారిని విడుదల చేసే వరకు కదలమంటు వెంకట్రావు బైఠాయించారు. దాడి చేసిన వంశీ అనుచరులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో స్టేషన్ నుంచి తమ అనుచరులతో యార్లగడ్డ వెంకట్రావు వెళ్లిపోయారు.
ఈ ఘటనపై మాట్లాడిన టీడీపీ నేతలు, కోర్టు ఆవరణలో ఉన్న తమను వంశీ అనుచరులు బెదిరించారని, పోలీసులకు చెప్పి స్టేషన్లో పెట్టాలని చెప్పారని తెలిపారు. గట్టిగా అరస్తూ తమతో వాగ్వాదానికి యత్నించారని అన్నారు. షర్ట్ కాలర్ పట్టుకుని బెదిరించారని, అదే విధంగా మరొక వ్యక్తి ఫోన్ తీసుకునేందుకు ప్రయత్నించారని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇటువంటి బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. కారు అద్దాలు సైతం గతంలో ధ్వంసం చేశారని చెప్పారు. ప్రస్తుత ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, తమకు రక్షణ కల్పించమని కోరామని అన్నారు.
'వైనాట్ 175' వెనుక భారీ కుట్ర - అసలు కారణం అదే! : యార్లగడ్డ వెంకట్రావు