Former Minister KTR Attend ACB Enquiry in Formula E Car Racing Case :ఫార్ములా ఈ రేసు నిర్వహణకు తన ఆదేశాలతోనే నిధులు మంజూరు చేశారని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అవినీతి నిరోధక శాఖ అధికారుల ఎదుట ఒప్పుకున్నారు. మంత్రి హోదాలో తన విచక్షణాధికారం ప్రకారమే నడుచుకున్నామని తెలిపారు. సమయాభావం వల్ల అనుమతుల గురించి ఆలోచించలేదని వెల్లడించారు. ఫార్మూలా ఈ రేసు కేసులో ఏసీబీ ఎదుట విచారణకు హాజరైన కేటీఆర్‌ను సుమారు 7 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫార్ములా ఈ రేసు కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు దూకుడు పెంచారు. నిందితులను వరుసగా విచారిస్తున్నారు. ఈ కేసులో ఏ-1గా ఉన్న కేటీఆర్ ఈ నెల 6నే విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే తన న్యాయవాదులను అనుమతించలేదన్న కారణంగా అర్ధాంతరంగా వెనుతిరిగారు. అదేరోజు అధికారులు మరోసారి నోటీసులివ్వడంతో గురువారం ఉదయం 10 గంటలకు కేటీఆర్ న్యాయవాదితో కలిసి ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. దర్యాప్తు అధికారిగా వ్యవహరిస్తున్న మాజిద్ సెలవులో ఉండటంతో డీఎస్పీ మధుసూదన్, జాయింట్ డైరెక్టర్ రితిరాజ్లు విచారించారు. మంత్రిమండలి ఆమోదం లేకుండా సుమారు రూ.55 కోట్లను ఎఫ్ఈఓకు చెల్లించారని, అలాగే విదేశీ సంస్థకు చెల్లింపు జరిపే ముందు ఆర్బీఐ అనుమతి తీసుకోలేదని అభియోగాలపై మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించారు.
కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు - సుప్రీంకోర్టులో సవాల్
కేటీఆర్ విచారణ మొత్తం ఎఫ్ఈఓకు నిధుల చెల్లింపుపైనే జరిగినట్లు తెలుస్తోంది. రెండోసారి ఫార్ములా ఈ రేసు నిర్వహణకు స్పాన్సర్‌గా వ్యవహరించిన ఏస్ నెక్స్ట్ జెన్ తప్పుకోవడంతో ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుందని చెప్పినట్లు సమాచారం. అయితే కొత్త స్పాన్సర్‌ను వెతికే సమయం లేకపోవడంతో HMDA నుంచి నిధులు మంజూరు చేశామని కేటీఆర్ తెలిపారు. ఇదంతా తన ఆదేశాల ప్రకారమే జరిగిందని వివరించారు. ఇందులో ఎలాంటి దురుద్దేశాలు, అవినీతి లేదన్నారు. అయితే మంత్రిమండలి ఆమోదం ఎందుకు తీసుకోలేదని అధికారులు ప్రశ్నించినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఇలా చేయడం మామూలేనని కేటీఆర్ చెప్పినట్లు సమాచారం.