Harish Rao on Veterinary Medicine Shortage : మూగజీవుల మౌనరోదనను తొలగించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. మూగజీవాల సంరక్షణపై నిర్లక్ష్యం వహించడం శోచనీయమని పేర్కొన్నారు. పశువైద్యశాలల్లో 9 నెలలుగా మందుల కొరత ఉందని తెలిపారు. సకాలంలో వైద్యం అందక పశువులు చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పశువైద్యశాలల్లో మందుల కొరతపై ఆయన లేఖ రాశారు. పశువైద్య సంచార వాహన సేవల్లో అంతరాయంపై ఆ లేఖలో వివరించారు.
వ్యవసాయంలో దన్నుగా నిలుస్తూ, పాడిసంపదతో అదనపు ఆదాయాన్ని సమకూర్చే మూగజీవాల సంరక్షణ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం శోచనీయమని లేఖలో హరీశ్‌రావు పేర్కొన్నారు. పశుసంవర్ధక శాఖ కూడా సీఎం రేవంత్ వద్దే ఉన్నప్పటికీ మూగజీవాల మౌనరోదనను మాత్రం పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు వ్యాధులు సోకితే తగిన వైద్యం అందించేందుకు ప్రభుత్వ పశువైద్యశాలల్లో మందులు లేని దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ మందులు సహా పెయిన్ కిల్లర్స్, విటమిన్స్, యాంటీ బయాటిక్స్ వంటి అన్ని రకాల మందుల సరఫరా తొమ్మిది నెలలుగా నిలిచిపోయిందని మండిపడ్డారు.
మందుల కొరత కారణంగా మూగజీవాలు మృత్యువాత : పాలిచ్చే జీవులకు పొదుగు వాపు, గాలి కుంటు వ్యాధులు సోకితే ఒక్కో మూగ జీవిపై పాడి రైతులు రూ.2 వేల దాకా ఖర్చు చేయాల్సి వస్తున్నదని హరీశ్‌రావు వాపోయారు. ఇది వారికి అదనపు ఆర్థిక భారమవుతున్నదని పేర్కొన్నారు. 9 నెలల నుంచి నట్టల నివారణ మందులు సరఫరా చేయకపోవడంతో కాలేయం, జీర్ణాశయం, చిన్నపేగు భాగాల్లో పరాన్న జీవులు చేరి రక్తహీనతకు గురి చేస్తున్నాయని తెలిపారు. దీని వల్ల రోగ నిరోధకశక్తి తగ్గి మూగజీవాలు బలహీనంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వ్యాధుల బారిన పడ్డ జీవులు ఆసుపత్రుల్లో మందుల కొరత కారణంగా సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.