Foreign Experts Report on Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుత సవాళ్లను అధ్యయనం చేసి సరైన మార్గనిర్దేశనం చేసేందుకు కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ కలిసి విదేశీ నిపుణుల బృందాన్ని నియమించాయి. డ్యాంల భద్రత, నిర్మాణం, జియో టెక్నికల్ అంశాల్లో అనుభవం ఉన్న డేవిడ్ బి.పాల్, రిచర్డ్ డోన్నెల్లీ, గియాస్ ఫ్రాంక్ డి సిస్కో, సీస్ హించ్‌బెర్గర్ జులై మొదటి వారంలో పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. దీనిపై విదేశీ నిపుణుల బృందం పంపిన సమగ్ర నివేదిక పోలవరం ప్రాజెక్టు అథారిటీకి గురువారం అందింది.
అందులో ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను అలాగే కొనసాగించాలని పేర్కొన్నారు. ప్రధాన డ్యాం ప్రాంతంలో పనులు చేసుకునేందుకు వీలుగా అక్కడ ఉన్న సీపేజి నీటిని ఎత్తిపోయాలని స్పష్టం చేశారు. ఈ సమయంలో సీపేజిని నియంత్రించేందుకు ఆ రెండు డ్యాంల దిగువ భాగంలో 3రకాల ఫిల్టర్లు ఏర్పాటు చేయాలని నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుత వర్షాకాలంలోనే ప్రధాన డ్యాం ప్రాంతంలో ఉన్న నీటిని ఎత్తిపోయడం ప్రారంభించాలని, గ్యాప్ 2 ప్రధాన డ్యాం ప్రాంతం పొడవునా సీపేజి నీటిమట్టానికి 3 మీటర్ల ఎత్తులో ఒక ప్లాట్‌ఫాం నిర్మించాలని సూచించారు.
పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం నుంచి నీటి తరలింపు - డిప్లీటింగ్ స్లూయిస్ నుంచి గోదావరిలోకి - Polavaram Main Dam Water Transfer
దాన్నుంచి ఎప్పుడూ నీటిమట్టం 3 మీటర్ల కన్నా దిగువన ఉండేలా పంపింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ ఏర్పాట్లు వచ్చే వానాకాలంలో కూడా డయాఫ్రం వాల్ నిర్మాణానికి అవాంతరాలు కలిగించని స్థితిలో ఉండాలన్నారు. 2024 వర్షాకాలం దాటగానే పనులు ప్రారంభించేందుకు వీలుగా డిజైన్, నిర్మాణ అంశాలు చర్చించేందుకు ఒక వర్క్‌షాప్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందులో పోలవరం ప్రాజెక్టు డిజైనర్, ప్రాజెక్టును పర్యవేక్షించే ఇంజినీర్ల బృందం, విదేశీ నిపుణుల బృందం ఉండాలని స్పష్టం చేశారు.
డిజైన్ల రూపకల్పన, నిర్మాణ షెడ్యూలు నిర్ణయించడం, అందుకు తగ్గ వనరులు ఏవేం కావాలో ఈ వర్క్‌షాప్‌లో ఒక స్పష్టతకు రావాలన్నారు. నాణ్యత నియంత్రణ, నిర్మాణ పనుల నిర్వహణ అంశాలు, సరైన సమయంలో తక్కువ ఖర్చుతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసే అంశాలపై ఈ సదస్సులో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలలో సీపేజికి కారణాలు తెలుసుకునేందుకు మరిన్ని పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని, ఇప్పటివరకు గుర్తించిన అంశాల ప్రకారం ఈ కట్టడాలకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు.
ప్రధాన డ్యాం ప్రాంతంలో భారీ వరదలకు అగాథాలు ఏర్పడ్డాయని, అక్కడ ఇసుక నింపి దాని సాంద్రత పెంచే వైబ్రో కాంపాక్షన్ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న డయాఫ్రం వాల్‌కు కొద్దిదూరం వరకు ఈ పనులు పూర్తిచేస్తే సరిపోతుందన్నారు. ఈ సమీపంలో వైబ్రో స్టోన్‌కాలమ్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని నివేదికలో స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్టులో గుత్తేదారును పర్యవేక్షించే వ్యవస్థే లేదని నివేదికలో నిపుణులు పేర్కొన్నారు. ఇలాంటి ప్రాజెక్టులో నిర్మాణ నాణ్యతకు, నిర్దేశించిన పని సక్రమంగా చేస్తున్నారో లేదో తేల్చుకునేందుకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. పోలవరంలో అలాంటి వ్యవస్థ లేదని అసలు పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల సంఘం ఇలాంటి వ్యవస్థ కోసం ఏం చేశాయో అవగతం కాలేదని విదేశీ నిపుణుల బృందం కుండ బద్దలుకొట్టింది.
ఇతర దేశాల్లో ఇలాంటి ప్రాజెక్టులు నిర్మిస్తున్న ప్రదేశంలోనే ఇంజినీర్స్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ ఆఫీసు ఉంటుందని, ప్రభుత్వం తరఫున అది పక్కాగా పనిచేస్తుందన్నారు. ఈ సంస్థ గుత్తేదారు పనులను పర్యవేక్షిస్తుందని, డిజైన్లకు అనుగుణంగా, నిర్మాణ షెడ్యూలుకు అనుకూలంగా పని పూర్తయ్యేలా ఆ సంస్థ బాధ్యత వహిస్తుందని నివేదికలో విదేశీ నిపుణుల బృందం పేర్కొంది.
నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రభుత్వం ఫోకస్ - 6 ప్రాజెక్టుల పూర్తికి తొలి ప్రాధాన్యం - AP Govt Focus on Irrigation Project