Food Poisoning Cases in Hyderabad : హైదరాబాద్ మహా నగరంలో ఫుడ్ పాయిజనింగ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నాసిరకం, నిల్వ చేసిన ఆహారంతో వంటకాలు తయారు చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం బంజారాహిల్స్‌కు చెందిన ఓ మహిళ మోమోస్ తిని ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో కల్తీ ఆహారంతో ఇబ్బంది పడుతూ ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆసుపత్రులకు వెళ్తున్న వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది.
ఇంత దారుణ పరిస్థితులా?: ఆహార భద్రత అధికారులు ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 8624 సార్లు నగరంలోని పలు హోటళ్లలో తనిఖీలు చేశారు. అయితే ఎక్కడ చూసినా నాసిరకం, కుళ్లిన ఆహార పదార్థాలను ఫ్రిజుల్లో నిల్వ చేయడం, గడువు ముగిసిన పదార్థాలను వినియోగించడం, వివిధ రకాల హానికర రంగులు వంటివి వాడటం, వంట గదుల్లో ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణమే వారికి కనిపించింది.
1 గంట నుంచి 36 గంటల్లోపు ఎప్పుడైనా : ఇలాంటి పరిస్థితులు ఉన్న హోటళ్లలో తింటే, ఆహారం తిన్న తర్వాత గంట నుంచి 36 గంటల వరకు ఎప్పుడైనా ముప్పు ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంది. సాల్మోనెల్లా, క్యాంపిలో బాక్టర్, ఇ.కోలి బ్యాక్టీరియాలు, లిస్టెరియా, నోరోవైరస్‌లు ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతాయి. దీంతోపాటు వివిధ రకాల డ్రగ్స్, టాక్సిక్స్‌తో ఆహారం కలుషితం అయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలపై కలుషిత ఆహారం తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడించారు.