Rain Water Came into The Electric TGS RTC Bus :శుక్రవారం (నవంబర్ 01)న సాయంత్రం ఓ ఆర్టీసీ బస్సులోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రయాణికులు పెద్దగా అరుపులు, కేకలు పెట్టారు. అందులో ఉన్న ఓ ప్రయాణికుడు వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది జరిగింది ఎక్కడో వరద ప్రాంతంలో కాదు మన రాజధాని నగరం హైదరాాబాద్లో. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బస్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు నిన్న ప్రయాణికులతో హఫీజ్పేట్ నుంచి కొండాపుర్ మార్గంలో వెళ్తోంది.
ఆ సమయంలో రహదారిపై నిలిచిన వరద నీరు బస్సులోకి వచ్చి చేరింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న కొందరి చెప్పులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. కొంత సమయం తర్వాత బస్సు డోర్ ఓపెన్ చేయడంతో వరద నీరు పూర్తిగా బయటకు వెళ్లిపోయింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ బస్సు గ్రౌండ్ లెవల్ తక్కువగా ఉండటంతోనే వరద నీరు లోపలికి వచ్చిందని సిబ్బంది తెలిపారు. ఎటువంటి ప్రమాదం జరగలేదని మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్సీయూ డిపో అధికారులు తెలిపారు.
చినుకు పడితే చిత్తడే : హైదరాబాద్ నగరంలో చినుకు పడితే చాలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు చేరి తీవ్ర అంతరాయం కలుగుతోంది. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో పలు వాహనాలు రోడ్డు మధ్యలో ఆగిపోతున్నాయి. అలాగే పలు వాహనాలు వరదలో చిక్కుకుని గల్లంతైన సందర్భాలు సైతం ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమవ్వడంతో ఆ ప్రాంత ప్రజల పరిస్థితి గందరగోళంగా మారింది.