Thief Stealing from Planes Arrested in Hyderabad : విమానాల్లో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను అరెస్ట్ చేసి రిమాండ్‌కు ఆర్‌జీఐ ఎయిర్‌పోర్టు పోలీసులు తరలించారు. విమానాల్లో తిరుగుతూ మహిళలకు సంబంధించిన బంగారు ఆభరణాలను తస్కరిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు, అతని వద్ద నుండి సుమారు ఒక కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కేసు వివరాలను శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
విమానాల్లో ప్రయాణించే ఒంటరి మహిళలే టార్గెట్ :దిల్లీకు చెందిన రాజేశ్ సింగ్ కపూర్ అనే వ్యక్తి జలసాలకు అలవాటు పడి, దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. 110 రోజుల్లో 200 సార్లు విమానాల్లో తిరుగుతూ చోరీలకు పాల్పడినట్లు తెలిపారు.కనెక్టివిటీ విమానాల్లో ప్రయాణించి ఒంటరి మహిళలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వివరించారు. విమానం ఎక్కిన తర్వాత ఆ ఒంటరి మహిళ పక్కనే తిరుగుతూ, తన వెంబడి తీసుకువెళ్లే బ్యాగును విమానంలో సదరు మహిళ పక్కనే క్యాబిన్‌లో భద్రపరిచిన లగేజ్ బ్యాగుల పక్కనే సదరు నిందితుడు సైతం బ్యాగ్ పెట్టేవాడని తెలిపారు.
ఈ క్రమంలోనే ఆ మహిళ వాష్‌రూమ్‌కు వెళ్లిన సమయాన ఆయా మహిళల బ్యాగులో నుంచి విలువైన ఆభరణాలను తీసుకొని తన బ్యాగులో వేసుకుంటూ వచ్చేవాడని తెలిపారు. విమానం దిగి బయటకు వచ్చాక ఆ జ్యూయలరీని పాన్ బ్రోకర్లకు విక్రయిస్తుండేవాడని డీసీపీ తెలిపారు. కాగా ఆర్‌జీఐ పోలీస్‌స్టేషన్‌తో పాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో నిందితుడిపై పదికిపైగా కేసులు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు.