Authories Dismiss Nine Volunteers :వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి, అధికార పార్టీకి గానీ ప్రచారం చేసే విధంగా ప్రవర్తించకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చెప్పినప్పటికీ ఇందుకు విరుద్దంగా కొందరు పని చేస్తున్నారు. కొంతమంది వాలంటీర్లు వైసీపీ అభ్యర్థుల ఇంటింట ప్రచారాల్లో పాల్గొనగా, మరికొందరు సోషల్ మీడియాలో ప్రచారాలకు పాల్పడుతున్నారు. అలాంటి వారిని ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు విధుల నుంచి తొలగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ ప్రచారాల్లో పాల్గొన్న గ్రామ వాలంటీర్లపై ఎన్నికల సంఘం కొరడా ఝలిపించింది.
ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు- వైసీపీ నేతలకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు
శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం రాసినేపల్లిలో కదిరి వైసీపీ అభ్యర్థి మక్బూల్ అహమ్మద్ ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొన్నారు. ఈసీ ఆదేశాలు బేఖాతరు చేశారంటూ నలుగురు వాలంటీర్లపై అధికారులు కొరడా ఝుళిపించారు. ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా వైసీపీ అభ్యర్ధి మక్బూల్ వాలంటీర్లను ప్రలోభ పెట్టేలా వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు భయపడకుండా రాజీనామా చేయాలని మరో రెండు నెలల్లో వైసీపీ అధికారం చేపట్టగానే తిరిగి వాలంటీర్లుగా నియమిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో అందర్నీ తీసుకొచ్చి ఓటేయించి వైసీపీని గెలిపించాలన్నారు. వైసీపీ నేత ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కారంటూ ప్రతిపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాలంటీర్, ఫీల్డ్ అసిస్టెంట్‌పై వేటు - volunteer suspension in kadapa
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఐదుగురు వాలంటీర్లను అధికారులు తొలగించారు. విడపనకల్లు ఎంపీడీఓ కొండయ్య శనివారం రాత్రి సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 12న విడపనకల్లులో జరిగిన వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో గడేకల్లుకు చెందిన గ్రామ వాలంటీర్లు హేమంత్, సురేశ్, మహేశ్, భీమరాజు, విడపనకల్లుకు చెందిన గ్రామ వాలంటీరు బసవరాజు పాల్గొన్నారు. దీనిపై ఈ నెల 13న ఈనాడులో వైసీపీ ఆవిర్భావ వేడుకల్లో వాలంటీర్లు అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం విచారణ చేయాలని జిల్లా కలెక్టరును ఆదేశించింది. ఆ సూచనల మేరకు క్షేత్ర స్థాయిలో ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులు విచారణ చేపట్టారు. వాలంటీర్లు కార్యక్రమంలో పాల్గొన్నారని విచారణలో తేలింది. వారిచ్చిన నివేదిక ఆధారంగా ఆ ఐదు గ్రామ వాలంటీర్లను తొలగించాలని ఉన్నత అధికారులు ఆదేశించారు. దానికి అనుగుణంగా వారిని తొలగిస్తూ ఎంపీడీఓ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనతో మిగతా గ్రామ వాలంటీర్లు ఉలిక్కి పడ్డారు. నిబంధనలను అతిక్రమిస్తే ఎన్నికల సంఘం తీసుకునే చర్యలను అనుభవించక తప్పదని వారు చర్చించుకుంటున్నారు.
వైసీపీ ఎన్నికల ప్రచారం ఎఫెక్ట్- 30 మంది వాలంటీర్లపై వేటు
కణేకల్లు మండలంలోని సొల్లాపురంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి తనయుడు విశ్వనాథరెడ్డి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అదే గ్రామానికి చెందిన వాలంటీర్లు శ్రీనాథ్, రాజశేఖర్ వైసీపీ కండువాలు ధరించి కరపత్రాలు చేత పట్టుకొని ప్రచారంలో పాల్గొన్నారు. అధికారులు స్పందించి వాలంటీర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. మెట్టు గోవిందరెడ్డి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న వాలంటీరు గంగాధరరెడ్డిపై కూడా వేటు పడింది. శుక్రవారం ఈనాడులో ప్రచురితమైన కథనానికి ఎంపీడీఓ గూడెన్న స్పందిస్తూ విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అతని వద్ద నుంచి సెల్‌ఫోన్, సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్నారు.
బాపట్ల జిల్లాలో కొండబట్లపాలెంలో 2 రోజుల క్రితం ఓ మహిళా వాలంటీరు వైసీపీకి అనుకూలంగా పోస్టులు పెట్టారు. భీమావారిపాలెం సచివాలయం వాట్సాప్ గ్రూపులో విపక్షాలపై దుష్ప్రచారం చేస్తూ పోస్టులు పెట్టి దొరికిపోయారు. విశాఖలో సీబీఐ భారీగా పట్టుకున్న మత్తు పదార్థాలను టీడీపీకి అంటగడుతూ పోస్టులు పెట్టారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను కించపరుస్తూ వీడియోలు షేర్ చేశారు. ఈసీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఇలాంటి కొత్త విధానానికి వైసీపీ తెరలేపిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
'జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి జగన్ మోసం'- టీడీపీలో చేరిన వాలంటీర్