వ్యర్థాల పైప్‌లైన్ తొలగించాలని మత్స్యకారుల ఆందోళన - బోటుకు నిప్పు - పలువురు ఆత్మహత్యాయత్నం Fishermen Protest in Kakinada District :సముద్రంలోకి వేసిన పైప్‌లైన్‌ను తొలగించాలంటూ మత్స్యకారులు ఆందోళనకు దిగారు. వ్యర్థాలు ఎక్కువై చేపల వృద్ధి తగ్గి ఉపాధి కోల్పోతున్నామంటూ రహదారిపై బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. గత మూడు రోజులుగా ఆందోళన చేపడుతున్నా పట్టించుకోవట్లేదంటూ కోనపాపపేటలో బోటు తగులబెట్టి గోడు వెల్లబోసుకున్నారు. మరొకొందరు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు.
ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నం : సముద్రంలోకి వేసిన పైపులైన్ తొలగించాలంటూ మత్స్యకారులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం పొన్నాడ పంచాయతీ పరిధిలోని కొనపాపపేట బీచ్ వద్ద రసాయన పరిశ్రమ సముద్రంలోకి వేసిన పైప్‌లైన్‌ను వ్యతిరేకిస్తూ గత మూడు రోజులుగా మత్స్యకారులు నిరసనలు తెలుపుతున్నారు. కాకినాడ - అద్దరిపేట బీచ్ రోడ్డులో టెంట్ వేసుకోని బైఠాయించారు. అయినా ఎవరూ పట్టించుకోవట్లేదంటూ ఆందోళనలు ఉద్ధృతం చేశారు. కోనపాపపేటలో దుకాణాలు మూసేసి బంద్ కొనసాగిస్తున్నారు. అంతటితో ఆగకుండా జాలరులంతా ఒక్కసారిగా దూసుకొచ్చి కోనపాపపేటలో బోటుకు నిప్పు అంటించారు. న్యాయం చేయాలంటూ మత్స్యకారులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీచ్ రోడ్డులో వాహనాలు నిలిచిపోయాయి.
దిగొచ్చిన ONGC - మత్స్యకారులకు పరిహారం చెల్లింపు
ఆర్థికంగా నష్టపోతున్నాం : పరిశ్రమల నుంచి సముద్రంలోకి పైప్‌లైన్ వేయడంతో కాలుష్య వ్యర్థాలు ఎక్కువై చేపల వృద్ధి తగ్గిపోతుందని, కాలుష్య వ్యర్థాల వల్ల చేపలు దొరక్క ఉపాధి కోల్పోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. చేపల వేట కోసం వెళ్లిన సమయంలో బోట్లు, వలలు పైపులైన్లకు తగిలి దెబ్బతింటున్నాయని, దీని వల్ల ఆర్థికంగా నష్టపోతున్నామని అన్నారు. సముద్రంలోకి వేసిన కాలుష్య పరిశ్రమల పైపులైన్లు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు ఎటువంటి లబ్ధి జరగలేదు: టీడీపీ ఇన్‌ఛార్జి కొండయ్య
మత్స్యకార కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ : పైపులైన్లు తొలగించాలని గతంలోనూ ఆందోళన చేసినా ఏ అధికారి, రాజకీయ నేత పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేపల వేట తప్ప తమకు ఇంకేం పనీ రాదని, తమ పొట్టకొట్టొద్దంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వందలాది కుటుంబాలు రోడ్డెక్కినిరసన చేసినా అధికారులు, పాలకులకు పట్టడం లేదని అన్నారు. సమస్య జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు ఇచ్చిన హామీలు కమిటీ సూచనలు వెంటనే అమలు చేయాలని కోరారు. సముద్రంలోని పైప్‌లైన్‌ను తొలగించి మత్స్యకార కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆత్మార్పణానికైనా సిద్ధమంటూ గంగపుత్రులు హెచ్చరించారు.
ఎమ్మెల్యే ద్వారంపూడి సముద్రగర్భాన్ని లూటీ చేస్తున్నాడు: మత్స్యకార జేఏసీ