Fire Mock Drill In Hyderabad :ప్రమాదాలు జరిగిన తర్వాత తీసుకునే చర్యలు కంటే అవి జరగకుండానే జాగ్రత్తలు తీసకుంటే మేలంటున్నారు అగ్నిమాపక శాఖ అధికారులు. ఇందులో భాగంగానే అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా ఆ శాఖ సిబ్బంది, అధికారులు హైదరాబాద్ మాదాపూర్‌లోని బహుళ అంతస్తుల భవనంలో మాక్‌డ్రిల్ నిర్వహించారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఆయా భవనాల్లో ఉండే వారు ఎలా స్పందించాలి, తక్షణం చేయాల్సిన పనులేంటి? సమయస్ఫూర్తిగా ఎలా నడుచుకోవాలి తదితర అంశాలపై చైతన్యం కల్పించారు.
రాష్ట్రంలో వరుస అగ్నిప్రమాదాలు - తీసుకోవాల్సిన జాగ్రత్తలివే - Fire Accidents in Summer
Fire Safety Week celebrations in Telangana 2024 :భవనం పైఅంతస్తులో మంటల్లో చిక్కుకుంటే వారిని బ్రాంటో స్కైలిఫ్ట్ వాహనం ద్వారా సురక్షితంగా బయటకు తీసుకువచ్చే విధానాన్ని అగ్నిమాపక శాఖ కళ్లకుకట్టింది. మంటల్ని నియంత్రించేందుకు ఉపయోగించే పరికరాలను పరిచయం చేశారు. అగ్నిమాపక వారోత్సవాల్లో అన్ని జిల్లాల్లో కలిపి 40 వేల మంది సిబ్బంది పాల్గొన్నారు.
ప్రధానంగా పరిశ్రమలు, పెట్రోల్ బంక్‌లు, ఆసుపత్రులు, ఎల్పీజీ గోదాములు, బహుళ అంతస్తుల భవనాలు, షాపింగ్ మాల్స్‌లో అగ్నిప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు అగ్నిమాపక సిబ్బంది, అధికారులు సిద్దంగా ఉండాలని ఆ శాఖ డీజీ నాగిరెడ్డి సూచించారు. అగ్నిప్రమాదాల నివారణపై తగిన అవగాహన కలిగి ఉంటే ప్రమాద తీవ్రత పెరగకుండా అరికట్టవచ్చని అగ్నిమాపక శాఖ చెబుతోంది.