Marriage Gift Scheme for Girl in Telangana:ప్రస్తుత రోజుల్లో అన్ని ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో రోజువారీ కూలీ పనులు చేసుకునే భవన నిర్మాణ రంగ కార్మికుల కుటుంబాల పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇంకా అమ్మాయిల పెళ్లి చేయాలంటే చెప్పనక్కర్లేదు.. అనేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వారిని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. కార్మికురాలు లేదా కార్మికుల కుటుంబంలో అమ్మాయిల వివాహానికి రూ. 30,000 అందిస్తోంది. మరి ఈ పెళ్లి కానుక అందుకునేందుకు ఉండాల్సిన అర్హతలు ఏంటి? దరఖాస్తు విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
అర్హతలు:
- ఈ పథకం తొలిసారి పెళ్లి చేసుకున్నవారికే మాత్రమే వర్తిస్తుంది.
- పెళ్లి జరిగిన తేదీ నుంచి ఏడాదిలోపు దరఖాస్తు చేసి ఉండాలి.
కార్మికుల కుమార్తె వివాహం అయితే:
- దరఖాస్తుదారురాల తల్లిదండ్రుల్లో ఒకరు కచ్చితంగా తెలంగాణ భవన, ఇతర కార్మిక సంక్షేమ మండలిలో సభ్యుడిగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.
- కేవలం ఇద్దరు కుమార్తెల వివాహాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
- పెళ్లి జరిగేనాటికి కార్మికుల కుమార్తెకు 18 సంవత్సరాలు దాటి ఉండాలి.
- ఒకవేళ తల్లిదండ్రులు ఇద్దరూ గుర్తింపు పొందిన కార్మికులు అయితే, ఎవరో ఒకరికి మాత్రమే వర్తిస్తుంది.
కార్మికురాలి వివాహం అయితే:
- దరఖాస్తుదారురాలు తెలంగాణ భవన, ఇతర కార్మిక సంక్షేమ మండలి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.
- అంతకుముందు పెళ్లి జరిగి ఉండకూడదు.
- ఈ పథకం కేవలం మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. పురుషుల వివాహాలకు వర్తించదు.