Film Stars Supporting AP Govt Campaign on Social Media:సోషల్ మీడియాను మంచికి వాడుదాం అంటూ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న రీతిలో చేపట్టిన ప్రచార పర్వానికి సినీ నటులు తమ మద్దతు తెలుపుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వ్యూస్ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని పిలుపునిచ్చారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై అవగాహన పెంచుతూ ఇప్పటికే ప్రభుత్వం నగరాల్లో భారీ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడవద్దు అనే గాంధీజీ సూక్తి కాన్సెప్ట్‌తో సోషల్ మీడియాపై క్యాంపెయిన్ చేపట్టారు. త్రీ మంకీస్ బొమ్మకు ఫోర్త్ మంకీ చేర్చి చెడు పోస్టులు వద్దంటూ ఆసక్తికరంగా హోర్డింగులు పెట్టారు. 'పోస్ట్ నో ఈవిల్' పేరుతో ఫోర్త్ మంకీ బొమ్మతో జరుగుతున్న ఈ ప్రచారానికి తాజాగా సినీ నటులు తోడవుతున్నారు.
మద్దతు తెలుపుతూ వీడియోలు విడుదల: ఈ ప్రభుత్వ కార్యక్రమానికి హీరోలు నిఖిల్, అడవి శేష్, నటి శ్రీలీల భాగమయ్యారు. సామాజిక మాధ్యమాల్లో వ్యూస్ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని పిలుపునిచ్చారు. 'పోస్ట్ నో ఈవిల్' (Post No Evil) గురించి తెలుపుతూ ఓ వీడియో విడుదల చేశారు. సోషల్ మీడియాను మంచి కోసం ఉపయోగించాలని కోరారు. మనం ఏదైనా వస్తువు కొనేముందు దాని గురించి పూర్తిగా తెలుసుకొని కొంటాం కానీ సోషల్ మీడియాలో న్యూస్ షేర్ చేసే ముందు అది నిజమా కాదా అని ఎందుకు చెక్ చేసుకోవడం లేదని హితవు పలికారు.