500 Dishes for Son In Law in Yanam : మర్యాద అంటే గోదారోళ్లు, గోదారోళ్లు అంటే మర్యాద. వారి మాటలకే కాదు ఆతిథ్యానికీ ప్రత్యేకత ఉంటుంది. ఇక పండగ వచ్చిదంటే గోదావరి జిల్లాల ప్రజలు ఇంటికొచ్చే బంధువుల పట్ల కనబరిచే ఆప్యాయతకు అంతే ఉండదు. మర్యాదలతో చుట్టాల్ని కట్టిపడేయటంలో వారిని మించినవారు లేరంటే అతిశయోక్తికాదు. అతిథులకు రకరకాల వెరైటీలతో కడుపు నింపేదాకా ఊరుకోరు.
సామాన్యంగానే అల్లుళ్లంటే మర్యాదలెక్కువ. అందులోనూ గోదావరి జిల్లాల్లో మరీ ఎక్కువ. ఇక సంక్రాంతి సమయాల్లో కొత్త అల్లుళ్లొస్తే ఆ హంగామా అంతా ఇంతా ఉండదు. కొత్త బట్టలు, పిండి వంటలు అవీ ఇవీ అని ఆ హడావుడే చెప్పనక్కర్లేదు. తాజాగా యానాం అత్తింటి వారు కొత్త అల్లుడికి కలకాలం గుర్తుండేలా పసందైన విందు ఇచ్చారు. తొలిసారిగా ఇంటికి వచ్చిన అతనికి సుమారు 500 రకాల వంటలు వడ్డించారు.
అత్తింటివారి మర్యాదలు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు అల్లుడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతం యానాం వర్తక సంఘం గౌరవాధ్యక్షుడు మాజేటి సత్యభాస్కర్, వెంకటేశ్వరి దంపతుల ఏకైక కుమార్తె హరిణ్యకు గతేడాది విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త సాకేత్‌తో వివాహం జరిపించారు. కొత్త అల్లుడిని మొదటి సంక్రాంతి పండగకు ఆహ్వానించి ప్రత్యేక విందును ఏర్పాటు చేసి ఆశ్చర్యపరిచారు.