ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నాన్న అమ్మేస్తానంటున్నాడు - ఇంటికి వెళ్లను' - బడిలోనే దాక్కున్న ఆరో తరగతి విద్యార్థిని

'నాన్న రోజూ కొడుతున్నాడు. నన్ను ఎవరికైనా అమ్మేస్తానంటున్నాడు. నాకు భయమేస్తోంది. ఇంటికి వెళ్లను' అంటూ బోరుమన్న ఆరో తరగతి విద్యార్థిని - బాలసదన్‌కు తరలించిన అధికారులు

Father Beat Daughter
Father Beat Daughter (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Father Beat Daughter :ప్రతి కుమార్తెకు అమ్మ కంటే నాన్న అంటేనే అమితమైన ప్రేమ. నాన్నే నా తొలి హీరో అని చెప్తూ మురిసిపోతోంది. కానీ ఓ విద్యార్థిని మాత్రం ఆ నాన్న వినికిడి వింటేనే హడలిపోతుంది. ఆ చిన్నారి కన్నీటి గాధ వింటుంటే గుండె చెరువైపోతుంది.

'నాన్న రోజూ కొడుతున్నాడు. నన్ను ఎవరికైనా అమ్మేస్తానంటున్నాడు. నాకు భయమేస్తోంది. ఇంటికి వెళ్లను' అంటూ ఆరో తరగతి విద్యార్థిని పాఠశాలలో దాక్కున్న ఉదంతం ఇది. కుమార్తెను తనకు అప్పగించాలంటూ బాలిక తండ్రి గొడవపడటంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జరిగిందీ.

భార్యపై కోపంతోనే : ఎంఈవో గురువారావు, పోలీసుల కథనం ప్రకారం, హైదరాబాద్‌ బాబానగర్‌కు చెందిన అక్బర్‌ దంపతులు కొన్ని నెలల క్రితం చౌటుప్పల్‌కు వెళ్లారు. అక్కడే నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వారి కుమార్తె(11)ను ఈ సంవత్సరమే చౌటుప్పల్‌లోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరో తరగతిలో చేర్పించారు. కొన్ని రోజుల క్రితం బాలిక తల్లి, తన మూడు సంవత్సరాల కుమారుడిని తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయినట్టు సమాచారం. అప్పట్నుంచి ఒంటరిగా ఉంటున్న తండ్రి భార్యపై కోపాన్ని కుమార్తెపై చూపుతూ వేధిస్తున్నాడని తెలిపారు.

Father Daughter Divorce Procession : కుమార్తెకు 'విడాకుల ఊరేగింపు'.. బ్యాండు బాజాలతో పుట్టింటికి తీసుకొచ్చిన తండ్రి

తండ్రి భార్యపై కోపంతో బుధవారం రాత్రి కుమార్తెను కొట్టాడు. దీంతో గురువారం బాలిక బడికి రాలేదు. మధ్యాహ్నం సమయంలో బిక్కుబిక్కుమంటూ వచ్చిన బాలిక ఆకలిగా ఉందంటూ స్నేహితురాళ్ల వద్ద వాపోయింది. తర్వాత తన బాధను వారితో చెప్పి బావురుమంది. స్పందించిన వారు జరిగిన విషయాన్ని ఉపాధ్యాయురాలికి చెప్పడంతో ఆమె భోజనం పెట్టించి ఓదార్చారు. ఇదే సమయంలో మద్యం మత్తులో అక్కడికి వచ్చిన తండ్రిని చూసి భయపడిన బాలిక అక్కడ నుంచి పరుగుపెట్టింది. పాఠశాల వెనక భాగంలోని 'భవిత' కేంద్రంలో దాక్కుంది. కుమార్తె కన్పించకపోవడంతో అతను ఉపాధ్యాయులతో గొడవ పడి, దాడికి ప్రయత్నించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. బాలిక మాత్రం 'నాన్న రోజూ కొడుతున్నాడు. నన్ను ఎవరికైనా అమ్మేస్తానంటున్నాడు. నాకు భయమేస్తోంది. ఇంటికి వెళ్లను' అంటూ వాపోయింది.

బాలసదన్‌కు తరలింపు :తర్వాత ఉపాధ్యాయులు బాలికను మండల వనరుల కేంద్రానికి తీసుకువెళ్లారు. ఎంఈవో గురువారావు ఇచ్చిన సమాచారంతో పోలీసులు బాలికను ఠాణాకు తీసుకెళ్లారు. జిల్లా బాలల సంరక్షణ కేంద్రం అధికారికి సమాచారం ఇచ్చారు. సామాజిక కార్యకర్త శ్వేత సంరక్షణలో బాలికను జిల్లా బాలసదన్‌కు తరలించారు.

తండ్రీకూతుళ్ల మధ్య ప్రేమకు ప్రతిరూపాలు ఈ చిత్రాలు!

ABOUT THE AUTHOR

...view details