Father and Son Selected Together in Telangana DSC :నారాయణపేట జిల్లా మరికల్ మండలం రాకొండ గ్రామానికి చెందిన జంపుల గోపాల్ డీఎస్సీ ఫలితాల్లో తెలుగు భాషా పండిత్ విభాగంలో నారాయణపేట జిల్లాలో మొదటి ర్యాంకు సాధించాడు. అదే సమయంలో స్కూల్ అసిస్టెంట్ విభాగంలో జిల్లాలో మూడో ర్యాంకు పొందారు. 2008, 2012, 2017 వరుస డీఎస్సీలు రాసి అదృష్టాన్ని పరీక్షించుకున్న గోపాల్, ప్రతిసారి స్వల్ప మార్కుల తేడాతో ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశాన్ని కోల్పోయారు. వరుస వైఫల్యాలు వెక్కిరించినా ఆయన కుంగిపోలేదు. వయసు మీద పడిందని పరీక్ష రాయకుండా వెనకడుగు వేయలేదు. ప్రభుత్వ ఉపాధ్యాయున్ని కావాలన్న లక్ష్యాన్ని వీడలేదు.
ఆఖరి ప్రయత్నంగా డీఎస్సీకి తన శక్తినంతా కూడతీసుకుని సుమారు నెల రోజుల పాటు సన్నద్ధమయ్యారు. సోమవారం విడుదల చేసిన ఫలితాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఎన్నికయ్యేందుకు అర్హత సాధించారు. ఎంఏ, బీఈడీ చేసిన గోపాల్ నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. ఇంటికి పెద్దవాడు కావడంతో తండ్రి తర్వాత బరువు బాధ్యతలన్నీ ఆయనవే. అందుకే తన తమ్ముళ్లు జీవితంలో స్థిరపడేందుకు, తన కుటుంబాన్ని నిలదొక్కుకునేందుకు తన జీవితాన్ని ధారపోశారు. కొన్నేళ్లు నాయి బ్రాహ్మణునిగా కుల వృత్తి చేశారు. మరికొన్నేళ్లు ప్రైవేట్ టీచరుగా, విద్యా వాలంటీరుగా సేవలందించారు. చివరకు 50 ఏళ్ల వయసులో ప్రభుత్వ ఉపాధ్యాయున్ని కావాలన్న తన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు.
'కుటుంబ బాధ్యతలు తీసుకుని మా ఫ్యామిలీ సెటిల్ అయ్యేవరకు చూసుకున్నా. తర్వాత నాకు చిన్న కోరిక మిగిలిపోయింది. ఎలాగైనా టీచర్ జాబ్ కొట్టాలని ఉండేది. కేవలం నెల రోజుల్లో పట్టుదలతో చదివి ఈ విజయం సాధించా'- జంపుల గోపాల్
తండ్రీతో పాటే కొలువు సాధించిన పెద్ద కుమారుడు : 50 ఏళ్ల వయసులో గోపాల్‌కు డీఎస్సీలో ఉద్యోగం రావడం ఒక ఎత్తయితే, అదే డీఎస్సీలో అతని పెద్ద కుమారుడు భానుప్రకాశ్ సైతం మొదటి ప్రయత్నంలోనే కొలువు కొట్టేశారు. బీఎస్సీ, బీఈడీ పూర్తి చేసిన భాను ప్రకాశ్ గణితం స్కూల్ అసిస్టెంట్ విభాగంలో జిల్లాలో 9వ ర్యాంకు సాధించారు. తండ్రీకుమారులిద్దరూ ఒకేసారి డీఎస్సీకి సన్నద్ధమవడం, ఇద్దరికీ ఉద్యోగాలు రావడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తోంది. అంతేకాదు ఇటీవల విడుదలైన టీఎస్పీఎస్సీ ఫలితాల్లో చిన్న కుమారుడు చంద్రకాంత్ సైతం గ్రామీణ నీటి సరఫరా ఆర్డబ్ల్యూఎస్ శాఖలో ఏఈఈగా ఉద్యోగం సాధించారు.