Father And Daughter Sentiment in AP Court :ఆడ పిల్లలకు తండ్రులతో ఉండే అనుబంధమే వేరు అనేదానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. ఆ చిన్నారి వయసు ఆరేళ్లు. అమ్మానాన్నలతో ఎంచక్కా ఆడుకోవాల్సిన ఏజ్. తండ్రి స్టీల్ ప్లాంట్లో, తల్లి రైల్వేలో పని చేస్తున్నారు. తల్లిదండ్రుల విభేదాల కారణంగా అమ్మాయి తల్లితో ఉంటుంది. ఆడ పిల్లలకు సహజంగానే తండ్రులతో ఉండే చనువే వేరు. దానికి తోడు ఇటీవల పాఠశాలలో జరిగిన పేరెంట్స్ డే రోజు తన ఫ్రెండ్స్ అందరూ పేరెంట్స్‌తో ఉంటే, ఆ చిన్నారి మాత్రం తల్లితోనే ఉండాల్సి వచ్చింది. వాళ్లందరిని చూసి ఆ చిన్నారి హృదయం తల్లడిల్లిపోయింది. 'అమ్మా.. నాన్న కావాలి' అంటూ మారాం చేసింది. 'కోర్టుకు నాన్న వస్తారు, అప్పుడు చూపిస్తాను' అని చెప్పింది. మంగళవారం కోర్టులో వాయిదాకు వచ్చినప్పుడు దూరంగా ఉన్న తన భర్తను ఆమె తన కుమార్తెకు 'అదిగో నాన్న' అంటూ చూపించింది.
'మా నాన్నను చూసేందుకు వచ్చా మేడం' : కోర్టు రూమ్‌లో ఆరేళ్ల చిన్నారి - FATHER AND DAUGHTER SENTIMENT
నాన్న కావాాలంటూ కుమార్తె మారాం - కోర్టు ప్రాంగణంలో దూరం చూపించిన తండ్రి- గమనించిన న్యాయమూర్తి - తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్
Published : 5 hours ago
|Updated : 5 hours ago
రెండు గంటల పాటు తండ్రీకుమార్తెలు :తర్వాత తల్లితో సహా కుటుంబ న్యాయస్థానంలోకి వచ్చిన చిన్నారిని న్యాయమూర్తి కె.రాధారత్నం గమనించి, పిల్లల్ని ఇలా తీసుకు రాకూడదని, ఎందుకు లోపలికి తీసుకువచ్చారని తల్లిని ప్రశ్నించారు. దీంతో జరిగిన విషయాన్ని తల్లి తరఫు సీనియర్ న్యాయవాది ఎ.భాగ్యలక్ష్మి న్యాయమూర్తికి తెలిపారు. దీంతో న్యాయమూర్తి నేరుగా ఆ చిన్నారితో మాట్లాడారు. కోర్టుకు ఎందుకు వచ్చావని ప్రశ్నించగా, 'నాన్నను చూడడానికి' అని న్యాయమూర్తితో తెలిపింది. చిన్నారి ఆవేదనను గమనించిన న్యాయమూర్తి కాసేపు విచారణ నిలిపేశారు. తండ్రిని పిలిచి చిన్నారిని ఆడించి తీసుకు రమ్మని ఆదేశించారు. దీంతో 2 గంటల పాటు ఆ తండ్రీకుమార్తెలు కోర్టు ప్రాంగణంలోనే గడిపారు. అనంతరం న్యాయమూర్తి చిన్నారి తల్లిదండ్రుల్ని పిలిచి, కుటుంబ బాధ్యతలు వివరించారు. తదుపరి విచారణను వాయిదా వేశారు.