Farming Marigold with LED Lights Getting Good Income in Kadapa District :ఏటా ఒకేరకమైన పంటలు వేస్తూ దిగుబడులు లేక నష్టపోతున్నారు రైతన్నలు. అందుకే ఈ రంగంలోకి కొత్తగా వస్తోన్న యువత కాస్త భిన్నంగా ఆలోచించి పంటమార్పిడిలతో లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ కుర్రాడు మరో ముందడుగేసి సాగుకి సాంకేతికత జోడించాడు. పంటపొలంలో జిగేల్ మనిపించే ఎల్‌ఈడీ (LED) లైట్లు అమర్చి సత్ఫలితాలు సాధిస్తున్నాడు. పెట్టుబడికి 2 మూడింతలు దిగుబడి రాబడుతూ యువరైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. మరి, అతడెవరు? తను సాగు చేస్తున్న పంట ఏంటి? ఏ విధంగా సాగుచేస్తున్నాడో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
యువరైతు వ్యవసాయక్షేత్రం కాంతులు వెదజల్లుతూ పరవశింపజేస్తుంది. వైవిధ్యానికి విజ్ఞానం జోడించి L.E.D లైట్లతో పంట పండిస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నాడు షేక్ అబ్దుల్లా. ఇతడిది అన్నమయ్య జిల్లా కలిచెర్ల స్వస్థలం. 2021లో అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేశాడు. పై చదువులు, ఉద్యోగాలంటూ బయటికి వెళ్లకుండా వ్యవసాయం వైపు అడుగులేశాడు. చదివింది వ్యవసాయ కోర్సు కావడంతో అందరిలా కాక వైవిధ్యంగా వ్యవసాయం చేయాలని పంట మార్పిడి విధానంలో సాగు చేయడం ప్రారంభించాడు.
వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలతో ఎల్‌ఈడీ లైట్ల వెలుతురులో చామంతి సాగుకి శ్రీకారం చుట్టాడు అబ్దుల్లా. తనకున్న 10 ఎకరాల్లో సగం వరకు సెంటెల్లా రకం పూలు తెప్పించుకుని మల్చింగ్, డ్రిప్ పద్ధతి ద్వారా సాగుచేస్తున్నాడు. 5 ఎకరాల చామంతి తోటలో ప్రతి మొక్కకు వెలుతురు పడేలా 2 అడుగులకు ఒక ఎల్‌ఈడీ బల్బు అమర్చాడు ఈ యువరైతు.
ఇది స్వర్గఫలం గురూ! ఒక్క పండు ధర 1500 - తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడే మొట్టమొదటి సారి సాగు
సూర్యరశ్మితోనే కిరణజన్య సంయోగక్రియ జరిగి మొక్కలు పెరుగుతాయని అందరికి తెలుసు. రాత్రి సమయంలోనూ ఆ ప్రక్రియ జరిగితే మొక్క ఎదుగుదల బాగుటుందని గ్రహించాడు అబ్దుల్లా. అందుకోసం పరిశోధన చేసి పొలంలో ఎల్‌ఈడీ లైట్లు అమర్చాడు. దీనివల్ల 24 గంటలు మొక్కల ఎదుగుదల కొనసాగుతూనే ఉండటం వల్ల పంట దిగుబడి బాగా వస్తుందని చెబుతున్నాడీ యువరైతు.