Farmers Struggle to Save Chilli Crop in Palnadu District:పాలకులు పట్టించుకోకపోయినా, ప్రకృతి సహకరించకపోయినా, పలు రకాల తెగుళ్లు, నకిలీ విత్తనాలతో పంట దెబ్బతిన్నా పగలు, రాత్రి తేడా లేకుండా సాగు అనే సమరాన్ని కొనసాగిస్తున్నారు పల్నాడు జిల్లా రైతులు. తీవ్ర వర్షాభావంతో ఖరీఫ్ సీజన్ కలిసిరాకపోయినా, అప్పు తెచ్చి మరీ రబీలో మిరప, పత్తి, మినుము, శనగ లాంటి పంటలు వేశారు. ఏ మాత్రం ముందు చూపులేని ప్రభుత్వం, అధికారుల ఆలసత్వం వల్ల తీవ్ర సాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. చేతికి వచ్చిన మిరప పంటను ఎలా కాపాడుకోవాలో అర్థం కాక అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. సాగర్ కెనాల్ నుంచి నీరు రాకపోవడంతో చెరువులు, కుంటల్లో ఉన్న కొద్దిపాటి నీటిని మోటర్ల సాయంతో పొలాలకు పెడుతూ పంటను కాపాడుకునేందుకు ఆలుపెరగని పోరాటం చేస్తున్నారు.
సీఎం సొంత జిల్లాలో కరెంట్ కష్టాలు - ఎండిపోతున్న పంటలు
పంట ఎండిపోయే దుస్థితి:ఎన్నడూ లేనంత తీవ్ర వర్షాభావ పరిస్థితులు పల్నాడు జిల్లా అన్నదాతలను కోలుకులేని దెబ్బతీస్తున్నాయి. వానలు, సాగునీరు లేక కరవు పరిస్థితులు ఖరీఫ్ సీజన్ రైతులకు నష్టాలను మిగిలిస్తే రబీలోనూ కర్షకులు కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. పల్నాడు జిల్లాలో నాగార్జున సాగర్ ఆయుకట్టు కింద లక్షలాది ఎకరాల్లో వరి, మిరప, పత్తి, పసుపు, మెుక్కజొన్న, శనగ లాంటి పంటను పండిస్తుంటారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులకు తోడు సాగర్ నుంచి సాగునీటిని ప్రణాళిక ప్రకారం విడుదల చేయడంలో పాలకులు విఫలం కావడంతో పల్నాడు అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలో 9 వేల హెక్టార్ల సాగుభూమిలో రైతులు మిరప, పత్తి తదితర పంటలు వేశారు. చెంతనే అమరావతి మేజర్ కాలువ ఉన్నా నీటి విడుదల లేకపోవడంతో పెదకూరపాడు, లగడపాడు, హుస్సేన్ నగరం, అత్తలూరు, తాళ్లూరు, అబ్బరాజుపాలెం, జలాల్‌పురం గ్రామాల చివర భూముల్లో మిరప పంట ఎండిపోయే దుస్థితి ఏర్పడింది.
పెట్టుబడి కూడా వస్తాదన్న నమ్మకం లేదు - కరెంటు కోతలతో అన్నదాతల అవస్థలు