Farmers Protest To Pay Dues From Government: మూడు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ధాన్యం బకాయిలు చెల్లించకపోవటంతో కృష్ణా జిల్లా పెనమలూరులో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. రైతులకు రావలసిన 890 కోట్ల రూపాయిలను రెండు రోజుల్లో విడుదల చేయాలని, లేకపోతే ఎన్నికల సమయంలో రైతుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికావాల్సి ఉంటుందని ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ హెచ్చరించారు. ధాన్యం బకాయిలుతక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు విజయవాడలోని పౌర సరఫరాల శాఖా రాష్ట్ర కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
తక్షణమే ధాన్యం బకాయిలను చెల్లించాలి: లోకేశ్
విత్తనం మెుదలుకొని పంట అమ్మేవరకూ అన్నీ ఆర్బీకే (Raithu Barosa Center) సెంటర్ల ద్వారా జరుగుతాయని చెప్పి 2నెలలు దాటినా రైతు అమ్మిన ధాన్యానికి డబ్బులు రాలేదని రైతులు మండిపడ్డారు. ఖరీఫ్ ధాన్యం డబ్బులు 21 రోజుల్లో ఇస్తామని సీఎం జగన్ ఇచ్చిన హామీ ఏమయ్యిందని రైతులు, రైతు సంఘం నాయకులు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన కొత్తలో 10 రోజుల్లో డబ్బులు చెల్లించి రైతులను మురిపించారని ప్రస్తుతం 2నెలలు గడిచినా పట్టించుకోవటం లేదని, రైతుల డబ్బులు ఎవరి ఖాతాలకు మళ్లిస్తున్నారని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ ప్రశ్నించారు. రైతుల ఆగ్రహానికిగురవ్వకుండా ఉండాలంటే తక్షణమే చెల్లింపులు జరగాలని డిమాండ్ చేశారు. ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు కావస్తున్నా నేటికీ బకాయిలు చెల్లించకపోవడం దారుణమని రైతు సంఘం నాయకులు మండిపడ్డారు. రైతు సంక్షేమం అంటే ఇదేనా అని సీఎం జగన్ను రైతులు ప్రశ్నిస్తున్నారు.