Tomato Prices Fall Down in Kurnool District : కొన్ని రోజుల క్రితం కళ కళలాడిన టమాటా ఇప్పుడు ధర (Today Tomato Price) లేక నేలచూపులు చూస్తోంది. ఆరుగాలం శ్రమించి, రూ.లక్షల ఖర్చు చేసి టమాటా సాగు చేస్తే కనీసం పెట్టుబడి రావడం లేదని టమాటా రైతన్నలు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. పంట చేతికి వచ్చే సమయానికి ధరలు పతనమై రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. తెగుళ్ల ప్రభావంతో దిగుబడులు తగ్గడం, అదే సమయంలో గిట్టుబాటు ధరలు (Affordable Prices) లభించక రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కిలో టమాటా రూపాయి, అంతకంటే తక్కువ ధరకు అడగడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రహదారిపై నిరసనకు దిగారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.
తక్కువకు వేలం పాడుతున్న వ్యాపారులు : కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో టమోటా ధరలు భారీగా పతనమయ్యాయి. దీంతో టమాటా రైతులు ఆందోళనకు దిగారు. ప్రతి రోజూ సరాసరిన వెయ్యి క్వింటాళ్ల టమోటాలు పత్తికొండకు మార్కెట్‌కు వస్తున్నాయి. వ్యాపారులు కిలో టమాటా రూపాయి, అంతకంటే తక్కువ ధర చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తపుణ్యానికి అమ్ముకోలేమంటూ మార్కెట్ యార్డులోనే నేలపై పారబోశి వెళ్లిపోయారు. సమీపంలోని పత్తికొండ- గుత్తి ప్రధాన రహదారిపైకి వచ్చి వాహనాలను అడ్డుకున్నారు. అనంతరం అన్నదాతలు నిరసనకు దిగారు. మంచి నాణ్యత ఉన్న సరకుకు కూడా వ్యాపారులు ధర పెట్టడం లేదని, తక్కువకు వేలం పాడుతున్నారని రైతులు నిప్పులు చెరిగారు. దీనివల్ల రవాణా ఛార్జీలు కూడా గిట్టుబాటు కావడం లేదంటూ వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.