Farmers Lost Their Lands in Kakinada SEZ :కాకినాడ సెజ్ పేరిట భూములు కోల్పోయిన రైతుల జీవితాలు 19 ఏళ్లుగా కకావికలమయ్యాయి. ఆశలు రేపిన 2021 నాటి జీవో-12 ప్రకారం తిరిగి భూమి పొందాల్సిన వందల మంది రైతులు ఇప్పటికీ అధికార యంత్రాంగం, సెజ్ యాజమాన్యం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయిన వాళ్ల కోసం రైతుల పొట్టగొట్టిన గత జగన్ సర్కార్, వారి ఉపాధి అవకాశాలకూ గండి కొట్టింది.
19 ఏళ్లుగా పోరాడుతున్న రైతులు :కాకినాడ సెజ్ బాధిత రైతులు భూములుండీ బికారుల్లా మారారు. 19 ఏళ్లుగా నరకప్రాయమైన రైతుల జీవితాలు బాగుపడేదెప్పుడో తెలియడం లేదు. ప్రభుత్వాలు కనికరించకపోవడంతో వాళ్ల కథ కంచికి చేరడం లేదు. ఎకరం భూమికి సెజ్ కంపెనీ తొలుత ఇచ్చిన 3 లక్షలు, తర్వాత ఇచ్చిన 2 లక్షలు ఎప్పుడో ఖర్చయిపోయాయి. ప్రస్తుతం భూమి లేకపోవడంతో రైతుల జీవన ప్రమాణాలు దిగజారాయి. అధికారుల ఒత్తిడి తట్టుకోలేక, ఆర్థిక ఇబ్బందులు తాళలేక మొదట 3లక్షలు తీసుకున్న కొంతమంది రైతులు తర్వాత ఇవ్వబోయిన 2 లక్షలు వద్దన్నారు. ఎలాగైనా భూమిని కాపాడుకోవాలని పరితపిస్తున్నారు. ఇంతకాలం తమ సమస్య గురించి ఎవరూ పట్టించుకోలేదని గగ్గోలు పెడుతున్నారు.
సెజ్ వ్యతిరేక ఆందోళనల అణచివేతకు రైతులపై పెట్టిన కేసుల్లో కొన్నింటిని మాత్రమే ఉపసంహరించారు. మరికొన్ని కేసులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కేసుల్లో ఇరుక్కున్న రైతులు వాయిదాలకు కోర్టుల చుట్టూ తిరగలేక తల్లడిల్లిపోతున్నారు. సెజ్ ప్రాంతంలో ఏ రైతును కదిపినా ఓ కన్నీటి కథ చెబుతున్నారు.
కాకినాడ సెజ్‌లో జేగ్యాంగ్ దోపిడీ - రైతుల భూములు లాక్కున్న దాడిశెట్టి రాజా
ఏపీ బల్క్ డ్రగ్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ : రైతుల పొట్టగొట్టడమే కాకుండా వారి ఉపాధి అవకాశాలకూ జగన్ ప్రభుత్వం గండి కొట్టింది. కాకినాడ సెజ్‌కు కేంద్రం మంజూరు చేస్తానన్న బల్క్‌డ్రగ్ పార్కు జగన్ కక్కుర్తితో ఆ ప్రాంతానికి దూరమైంది. 2020లో ఈ బల్క్‌డ్రగ్ పార్కు కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం 2వేల ఎకరాల భూమి ఇవ్వాల్సి ఉంది. మొత్తం 16వందల 72 కోట్ల వ్యయంలో వెయ్యి కోట్లు కేంద్రం గ్రాంటుగా ఇస్తానంది. ఇంత మొత్తం డబ్బు గ్రాంటుగా వస్తున్నందున కాకినాడ సెజ్‌లో పెట్టిస్తే తమ అరబిందో గ్రూపునకు బ్రహ్మాండమైన ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని జగన్ ప్రభుత్వం ప్లాన్ వేసింది. ఏపీఐఐసీకి అనుబంధంగా "ఏపీ బల్క్ డ్రగ్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్" సంస్థను ఏర్పాటు చేయించింది. ఈ సంస్థ బల్క్ డ్రగ్ పార్కును అమలుచేసే ఏజెన్సీగా వ్యవహరిస్తుందని చెప్పింది.
బల్క్ డ్రగ్ ప్రాజెక్టులో అరబిందోకు 88 శాతం, ఆ సంస్థకే చెందిన సెజ్ కంపెనీకి ఒక శాతం, రాష్ట్ర ప్రభుత్వ ఎస్ఐఏకి కేవలం 11 శాతం వాటా ఉంటుందని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అయితే కేంద్రం ముందు జగన్ సర్కార్ పప్పులు ఉడకలేదు. ఈ ప్రాజెక్టులో ప్రైవేట్ సంస్థ అరబిందోకు 88 శాతం ఉండటం ఆమోదయోగ్యం కాదని స్పష్టంచేసింది. ప్రైవేట్ సంస్థ భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల్ని పాటిస్తుందనే భరోసా ఉండదని సందేహం వ్యక్తం చేసింది. ప్రాజెక్టు నియంత్రణలో ప్రభుత్వ పాత్ర నామమాత్రంగానే ఉన్నందున కాకినాడ సెజ్‌లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుచేస్తే వెయ్యి కోట్ల గ్రాంటు ఇవ్వబోమని తేల్చిచెప్పింది. ఈ పత్రాలను కూడా ఈటీవీ భారత్ - ఈనాడు సంపాదించాయి. కేంద్రం నిర్ణయంతో కంగుతిన్న జగన్ ప్రభుత్వం విశాఖ సమీపంలోని ఏపీఐసీసీ భూముల్లోకి ప్రాజెక్టును మార్చింది. అదే కాకినాడ సెజ్‌లో సగం వాటాలు ఓఎన్జీసీ, రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉండి ఉంటే స్థానికంగా వేల మందికి ఉపాధి కల్పించే బల్క్‌డ్రగ్ పార్కు ఇక్కడే ఏర్పాటయ్యేది.
జగన్ మరో దాష్టీకం వెలుగులోకి - రాక్షస రాజకీయంతో కాకినాడ పోర్టు అరబిందో పరం!
కాకినాడ సెజ్‌లో ఎకరం 29 వేలేనా? - జగన్‌ని A1గా చేర్చాలి: ఆనం