Farmers Facing Problems due to Lack Of Water in Cherlopalli Reservoir :వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. కనీసం నిర్వహణ ఖర్చులు ఇవ్వకపోవడంతో జలాశయాలను నీటితో నింపలేకపోయారు. మరికొందరు వైఎస్సార్సీపీ నాయకులు స్వార్థ రాజకీయాల కోసం వేల మంది రైతుల జీవితాలను పణంగా పెట్టారు. రాయలసీమలోనే అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన కదిరి నియోజవర్గంలో సాగు, తాగునీటి కష్టాలను తీర్చేందుకు గతంలో తెలుగుదేశం హయాంలో చెర్లోపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మించారు.
Peddireddy Turned Cherlopalli Water to kuppam : కుప్పం వెళ్లే హంద్రీనీవా కాలువపై నిర్మించిన ఈ జలాశయానికి జీడిపల్లి నుంచి కృష్ణా జలాలు తరలిస్తారు. అక్కడి నుంచి పుంగనూరుకు నీటిని తీసుకెళ్లేలా రూపొందించారు. జీడిపల్లి నుంచి చిత్తూరు జిల్లాకు వెళ్లే హంద్రీనీవా ప్రధాన కాల్వ నుంచి కుప్పం బ్రాంచ్ కెనాల్ తవ్వారు. దాదాపు 67 కిలోమీటర్లు నీరు ప్రవహించి చెర్లోపల్లి జలాశయానికి చేరతాయి. 2017లోనే చెర్లోపల్లి జలాశయం పనులు పూర్తికాగా రెండు సీజన్లు కృష్ణా జలాలతో నింపారు. దీంతో కదిరి నియోజకవర్గంలో భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. రైతులు బోర్లు వేసుకుని పంటలు పండించుకున్నారు.
గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో కేవలం రెండుసార్లు మాత్రమే జలాశయాన్ని నింపినా భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండటంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది తెలియలేదు. కానీ ఎన్నికల ముందు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వార్థ రాజకీయంతో జలాశయంలో ఉన్న నీటిని మొత్తం తన నియోజకవర్గం పుంగనూరుకు తరలించారు. చుక్క నీరు లేకుండా జలాశయం ఖాళీ చేయడంతో కదిరి ప్రాంతంలో మళ్లీ తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి.