ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లంకె బిందెలతో నమ్మించాడు-లక్షలు కాజేశాడు - సీన్​ కట్​ చేస్తే - FAKE BABA CHEATING

సినిమా స్టైల్​లో పూజలు - బయటపడ్డ బిందెలు - అప్పటికే బాధితులను నుంచి సొమ్ము వసూలు - ఇంకా డబ్బులు తేవాలని ఒత్తిడి - ఆ తరువాత ఫోన్​కు స్పందించని ఫేక్​ బాబా

Fake Baba Cheating
Fake Baba Cheating (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 20, 2025, 7:51 PM IST

Fake Baba Cheated Case Solved Police: ఓ వైపు టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందుతున్నా మరోవైపు మూఢనమ్మకాలతో చాలామంది మోసపోతున్నారు. ఈజీ మనీ కోసం ఆరాటపడుతున్న వాళ్ల బలహీనతే మోసగాళ్లకు కలిసొస్తుంది. ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా, ఎంతోమంది జైలు పాలవుతున్నా మోసపోయే వాళ్లు ఇంకా మోసపోతూనే ఉన్నారు. లంకె బిందెల పేరుతో పలువురిని మోసం చేసిన దొంగబాబా ఉదంతం విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. ఆనందపురం మండలం బంటుపల్లివారికల్లాలకు చెందిన అప్పలరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటన బయటపడింది.

ఆనందపురం సీఐ సీహెచ్ వాసు నాయుడు మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాల వెల్లడించారు. "రెండు నెలల క్రితం అప్పలరాజుకు బంధువుల ద్వారా యోగేంద్రబాబా అలియాస్​ పైడిపాటి వెంకట భార్గవ్​ రాఘవ (35) పరిచయమయ్యాడు. ఈ క్రమంలోనే పూజలు చేస్తే లంకె బిందెలు లభ్యమవుతాయని నమ్మించాడు. దీనికి లక్షల్లో డబ్బులు కావాల్సి ఉంటాయని తెలిపాడు. దీంతో అప్పలరాజు మరో ముగ్గురు స్నేహితులను ఇందుకోసం జత చేసుకున్నాడు. నలుగురు కలిసి బాబాకు రూ.28 లక్షలు ముట్టజెప్పారు. ఇక్కడకు వరకు బాగానే ఉంది. ఇక బాబా అసలు కథ ఇప్పుడే మొదలుపెట్టాడు".

"ముందస్తు ప్రణాళిక ప్రకారం దొంగబాబా ఆనందపురంలో అద్దెకు ఇల్లు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆనందపురం మండలం గుడిలోవలో నిర్మానుష్య ప్రాంతంలో రాళ్లు నింపిన నకిలీ లంకెల బిందెలను పాతిపెట్టాడు. అనంతరం అప్పలరాజు, ఆయన స్నేహితులను అక్కడకు పిలిపించి పూజలు నిర్వహించాడు. ఆ ప్రాంతంలో పురాతన దేవాలయం ఉండటం వల్ల బాధితులకు మరింత నమ్మకం కుదిరేటట్లు చేశాడు. పూజల అనంతరం ముందే అనుకున్న విధంగా పాతిపెట్టిన స్థలాన్ని తవ్వించాడు. లంకె బిందెలు బయటపడటంతో బాధితులు సంతోషం వ్యక్తం చేశారు".

"వాటిని ఆనందపురంలోని అద్దె ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ పూజలు చేయాలని, అనంతరమే వాటిని తెరవాలని వారికి బాబా సూచించాడు. ఇందుకోసం మరింత డబ్బు తీసుకు రావాలని తెలిపాడు. లేకపోతే రక్తం కక్కుకుని చనిపోతారని భయపెట్టాడు. ఈ క్రమంలో వారంతా మిగతా డబ్బులు రెడీ చేసుకునేందుకు అక్కడినుంచి వెళ్లిపోయారు. డబ్బు సిద్ధం చేసుకుని ఎన్నిసార్లు ఫోన్​ చేసినా బాబా ఎత్తలేదు. దీంతో వారికి అనుమానం వచ్చింది. వారు వెంటనే పోలీసులను ఆశ్రయించారు".

విచారణ చేపట్టిన పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. వారి నుంచి కారు, లక్ష 75 వేల నగదు, 7 సెల్​ఫోన్లతో పాటు రాగి బిందెలను స్వాధీనం చేసుకున్నారు. దొంగబాబా పైడిపాటి వెంకట భార్గవ్​పై వివిధ పోలీస్​స్టేషన్లలో 7 కేసులున్నాయని పోలీసులు తెలిపారు.

రూ.43 వేలకు ప్రతిరోజూ రూ.3 వేలు చెల్లింపు - నమ్మొద్దంటున్న పోలీసులు

మామూలు ప్లాన్​ కాదు - బంగారం దోపిడీకి ఏం చేశాడంటే !

ABOUT THE AUTHOR

...view details