ETV Hyderabad Bureau Chief Adinarayana Passed Away :సీనియర్ జర్నలిస్ట్, ఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్ టి.ఆదినారాయణ కన్నుమూశారు. అపార్ట్మెంట్పై వాకింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడ్డారు. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సహా ప్రముఖులు సంతాపం తెలిపారు. నారాయణ ఆకస్మిక మృతి బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సమాజం మార్పు కోసం కృషి చేసిన వ్యక్తి :ఆదినారాయణ మరణం పట్ల ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిబద్ధత కలిగిన ఆయన, సమాజంలో మార్పునకు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. నారాయణ మృతి పట్ల సంతాపం తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్, వర్తమాన రాజకీయాలు, ప్రజా సమస్యలపై ఎంతో అవగాహన ఉన్న జర్నలిస్ట్ నారాయణ అని కొనియాడారు. ఇటీవలి కాలంలో అనారోగ్యానికి గురైన ఆయన కోలుకుంటారని ఆశించానని, ఆయన అనారోగ్యం నుంచి కోలుకునేలోపే మరణ వార్త వినడం చాలా బాధాకరమన్నారు. ఆదినారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
వృత్తిపట్ల నిబద్ధత, క్రమశిక్షణ :ఆదినారాయణ మృతి పట్ల వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వృత్తిపరంగా పలు సందర్భాల్లో తనతో మాట్లాడేవారని గుర్తు చేశారు. వృత్తిపట్ల నిబద్ధత, క్రమశిక్షణ పాటించేవారని కొనియాడారు.