Ramoji Rao Grand Daughter Brihathi About Her Grandfather :రామోజీరావుగారు మీడియా మేరు పర్వతం, విలువల శిఖరం. ఆ లివింగ్ లెజెండ్‌కి మనవరాలిగా పుట్టడం నా అదృష్టం. మనవరాలిగా ఆయన గొప్పతనం గురించి చిన్నప్పుడే అర్థం చేసుకోగలిగా. తాతగారి పట్టుదల, దార్శనికత, స్థిత ప్రజ్ఞతలను దగ్గరగా చూసే అదృష్టం కుటుంబ సభ్యులుగా మాకు దక్కింది. వ్యవస్థలోని అవినీతి, అక్రమాలు, అసమర్థ పాలనలపై ఈనాడు రాసిన కథనాలు శతఘ్నుల్లా పేలడం వెనక ప్రజలకు మంచి చేయాలన్న ఆయన తపనే కారణం. తాతగారు మా ఐదుగురికీ సమ ప్రాధాన్యం ఇచ్చేవారు. నాణ్యమైన సమయాన్నీ గడిపేవారు. ‘గుప్పిట మూసి ఉన్నంతసేపే బలం ఉంటుంది. మీరందరూ కలసికట్టుగా సాగుతూ సంస్థకు బలాన్ని ఇవ్వాలి’ అనేవారు.
తాతయ్య ఇచ్చింది చిన్న ప్రశంసే అయినా ఏళ్లపాటు ఇంధనం :ఆఫీసుకి సంబంధించిన చర్చల్లో ‘ఈ ఐడియా వచ్చింది’ ‘ఇలా చేయాలనుకుంటున్నామ’ని చెబితే నిర్మొహమాటంగా అభిప్రాయాలు చెప్పేవారు. అన్నికోణాలనూ పరిశీలించి లోతైన విమర్శలు చేసేవారు. ఆయన కూడా సద్విమర్శను కోరుకునేవారు. ఓ సమావేశంలో మాకో ప్రపోజల్ వచ్చింది. దాన్ని ఈటీవీ భారత్‌లో కూడా అమలు చేస్తే బాగుంటుందన్న చర్చ జరిగింది. తరవాత సమావేశం నాటికి నేను ఇతర పబ్లిషర్స్ విధానాలు, లోపాలు, మార్గాలు వంటివాటితో కూడిన ఓ నివేదిక ఇచ్చా. అది ఆయనకు నచ్చి ‘బాగా చేశావు’ అని అభినందించారు. చిన్న ప్రశంసే కానీ అది చాలా ఏళ్లపాటు ఇంధనంగా పనిచేస్తుంది.
కాలం కంటే వేగంగా పరుగెత్తి మరీ తాతగారు చెప్పే ఐడియాలను విన్నప్పుడు అబ్బా ఇది మాకెందుకు రాలేదు అని ఎన్నిసార్లు అనుకున్నానో! 1936లో పుట్టిన వ్యక్తికి ఇన్ని ఆధునిక భావాలు, ఆదర్శభావాలు అబ్బురమనిపించేది. ఆయన ఏ విషయంలోనూ కులం, మతం పట్టించుకోరు. ఓసారి నా స్నేహితురాలు కులాంతర వివాహం చేసుకుందని ఆయనతో చెప్పా. మంచి విషయం వారిద్దరి మధ్య సఖ్యత ఉండాలి కానీ, ఇవన్నీ అనవసరం అన్నారు.
తానూ ఇంటి పేరుని పక్కన పెట్టి రామోజీరావుగానే గుర్తుండిపోవాలనుకున్నారు. అందుకే, ఆధార్ కార్డులో సైతం అలానే నమోదు చేయించుకున్నారు. చాలామంది బట్టలు, నగలు వేసుకుంటేనో, బాగా రెడీ అయితేనో ఆనంద పడతారు. కానీ, తాతగారు మాత్రం ఈరోజు ఏం కొత్తగా చేశాం? ఎవరి జీవితానికి ఉపయోగపడేలా చేశాం? అని ఆలోచించేవారు. తాతగారు తన హోదాకి తగ్గట్లు ఓ ఇరవై విలాసవంతమైన కార్లను ఇంటి ముందు నిలపగలరు. వేసుకుని తిరగనూ గలరు. కానీ, ఆయన చివరి వరకూ ఓ పాత ఇన్నోవానే వాడేవారు. వస్తువులకూ, ఆడంబరాలకూ ఏ మాత్రం విలువనిచ్చేవారు కాదు.