Etikoppaka Toys in Republic Day :గణతంత్ర దినోత్సవం నాడు దిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్ర సాంస్కృతిక, కళా వైభవాన్ని చాటిన ఏటికొప్పాక పర్యావరణ అనుకూల శకటానికి మూడో బహుమతి లభించింది. తొలి రెండు బహుమతులకు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మహాకుంభమేళా శకటం, త్రిపురకు చెందిన 14 దేవతామూర్తుల ఆరాధన శకటాలకు లభించాయి. ముగ్గురు సభ్యులతో కూడిన జడ్జీల ప్యానల్ వివిధ రాష్ట్రాలు ప్రదర్శించిన శకటాల రూపకల్పన, వాటి ఇతివృత్తాలను పరిశీలించి ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర రక్షణశాఖ అవార్డులను ప్రకటించింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన పోల్‌లో గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ శకటాలు మొదటి మూడు బహుమతులను దక్కించుకున్నాయి.
ముందు వినాయకుడు, చివర ఎత్తైన శ్రీ వేంకటేశ్వరస్వామి రూపాలు, ఇరువైపులా బొబ్బిలి వీణలు, తెలుగువారి కట్టుబొట్టును ప్రతిబింబించే బొమ్మలకొలువు, చిన్నారుల ఆటపాటల చిత్రాలతో రూపొందించిన రాష్ట్ర శకటం ఆధ్యాత్మిక భావాన్ని, సంస్కృతిని చాటిచెప్పింది. ఇందులో ఉపయోగించినవన్నీ ఏటికొప్పాక బొమ్మలే కావడం విశేషం. అంకుడు కర్రతో తయారుచేసే ఈ బొమ్మల్లో ఎక్కడా వంపు కనపడదు. మొన లేకుండా అన్నివైపులా గుండ్రంగా ఉండడం వల్ల వీటితో ఆడుకునే పిల్లలకు గాయాలవ్వవు. ప్రధాని మోదీ దేశీయంగా తయారయ్యే బొమ్మలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చిన తర్వాత వీటికి ప్రాధాన్యం పెరిగింది. కళాకారులు ఈ బొమ్మల ద్వారా రాష్ట్రంతోపాటు, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు మరింత ప్రాచుర్యం కల్పిస్తున్నారు.
రాష్ట్రానికి గర్వకారణం:రాష్ట్ర శకటానికి మూడో స్థానం రావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని ఎక్స్ వేదికగా బుధవారం పేర్కొన్నారు. ఈ శకటం రూపకర్తలు, రాష్ట్ర అధికారులు, ఏటికొప్పాక బొమ్మలు తయారు చేసే కళాకారులకు అభినందనలు తెలిపారు.