Etikoppaka Puppet Show Sakatam at Republic Day Parade Celebration :జనవరి 26న దిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగే 76వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో మొత్తం 26 శకటాలు పరుగులు తీయనున్నాయి. ఇందులో 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, అలాగే 10 కేంద్రప్రభుత్వ శాఖల శకటాలు పాల్గొననున్నాయి. ఈరోజు(గురువారం) ఫుల్‌డ్రస్ రిహార్సల్స్ జరగబోతున్న నేపథ్యంలో కేంద్ర రక్షణశాఖ అధికారులు బుధవారం ఈ శకటాలను అక్కడ ప్రదర్శించారు. ఈ శకటాలన్నీ కూడా భారత్‌కు ఉన్న భిన్నత్వంలో ఏకత్వ బలాన్ని చాటుతాయని రక్షణశాఖ పేర్కొంది. దిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగే పరేడ్‌కు శకటాలు ఎంపికైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు గోవా, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా, ఝార్ఖండ్, బిహార్, పంజాబ్, మధ్యప్రదేశ్, త్రిపుర, కర్ణాటక, పశ్చిమబెంగాల్, చండీగఢ్, దిల్లీ ఉన్నాయి.
దక్షిణాది నుంచి రెండు రాష్ట్రాలే : ఇందులో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఆ రాష్ట్రంలో జరుగుతున్న మహాకుంభమేళాకు ప్రచారం కల్పించేలా ‘మహాకుంభ్- 2025 సువర్ణ భారతం వారసత్వం, అభివృద్ధి’ పేరుతో శకటాన్ని ప్రదర్శిస్తోంది. అలాగే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల చీతాలను వదిలిన కూనో నేషనల్ పార్క్ శకటాలను, హరియాణా భగవద్గీత శకటాలను ప్రదర్శించనున్నాయి. దక్షిణాది నుంచి ఈసారి ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు, ఈశాన్య రాష్ట్రాల నుంచి త్రిపురకు మాత్రమే అవకాశం దక్కింది.