Enumerators Facing Problems in Telangana: తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే సమస్యలతో కొనసాగుతోంది. ప్రజల వద్దకు వెళ్లిన ఎన్యూమరేటర్లు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి సమాచారం ఫారంలో నింపాల్సి ఉంది. సర్వేలో మొత్తం 75 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉండగా, తమకు అందుతున్న పథకాలు రద్దు అవుతాయేమోనన్న అనుమానంతో ప్రజలు సరైన సమాధానాలు చెప్పడంలేదు. దీనికి తోడు ఎన్యూమరేటర్లుగా ఉన్న టీచర్లు ఉదయం తమ విధులను చూసుకుని ఇళ్ల వద్దకు వెళ్తుండగా, ఆ సమయానికి ప్రజలు వ్యవసాయ క్షేత్రాలకు, ఇతర పనులకు వెళ్తున్నారు. ఫలితంగా ఇళ్లకు తాళం వేసి ఉంటున్నాయని, ఒక్కో ఇంటికి రెండు, మూడు సార్లు తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మీకెందుకు చెప్పాలి? : సర్వేలో మొత్తం 75 రకాల అంశాలపై వివరాలు సేకరించాల్సి ఉంది. ఇలా ఒక్కో కుటుంబానికి దాదాపు గంట టైమ్ పడుతోంది. అయితే ఉదయం పాఠశాల నిర్వహించి మధ్యాహ్నం సర్వేకు వెళ్లే ఉపాధ్యాయులకు పలు గ్రామాల్లో తాళాలతో ఇళ్లు దర్శనమిస్తున్నాయి.
ఇలా ఒక్కో ఇంటికి రెండు, మూడుసార్లు తిరుగుతున్నప్పటికీ సర్వే పూర్తి కావడం లేదని ఎన్యూమరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు గ్రామాల్లో ప్రజలు ఎన్యూమరేటర్లను ప్రశ్నిస్తున్నారు. మాకేమైనా పథకాలు ఇస్తారా, అసలు మీకెందుకు వివరాలు చెప్పాలంటున్నారు. ద్విచక్రవాహనాలు, ట్రాక్టర్లు, కార్లు ఉన్నా, అవి తమవికాదని పలువురు చెబుతున్నారు. ఇలా చాలా చోట్ల సర్వే సాఫీగా సాగడం లేదు. స్థిరాస్తులు వివరాలతో పాటు, టీవీ, రిఫ్రిజరేటర్, ద్విచక్రవాహనం, కారు, వాషింగ్ మిషన్ తదితర వివరాలను ఎన్యూమరేటర్లకు చెప్పడం లేదు.