తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇంటికి వెళితే తాళాలు - ఒకవేళ ఉన్నా ఆ వివరాలు చెప్పరు!' - ఎన్యుమరేటర్ల ఆవేదన - ENUMERATORS PROBLEMS IN SURVEY

సర్వేకు ఆపసోపాలు పడుతున్న సిబ్బంది - విధులు చూసుకుని సర్వేకు ఇళ్లకు వెళ్లేసరికి లాక్​ చేసి ఉంటున్నాయని ఆవేదన

Enumerators Problems in Survey
Enumerators Problems in Survey (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 18, 2024, 4:30 PM IST

Updated : Nov 18, 2024, 4:39 PM IST

Enumerators Problems In Survey :సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల సమగ్ర కుటుంబ సర్వే సమస్యలతో కొనసాగుతోంది. ప్రజల వద్దకు వెళ్లిన ఎన్యూమరేటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి సమాచారం అడిగి ఫారంలో నింపాల్సి ఉంది. సర్వేలో మొత్తం 75 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉండగా, తమకు అందుతున్న పథకాలు రద్దు అవుతాయోనన్న అనుమానంతో ప్రజలు సరైన సమాధానాలు చెప్పడంలేదు. దీనికి తోడు ఎన్యూమరేటర్లుగా ఉన్న టీచర్లు ఉదయం తమ విధులు చూసుకుని ఇండ్లవద్దకు వెళ్తుండగా, ఆపాటికి ప్రజలు వ్యవసాయ క్షేత్రాలకు, ఇతర పనులకు వెళ్తున్నారు. ఫలితంగా ఇళ్లు లాక్​ చేసి ఉంటున్నాయని, ఒక్కో ఇంటికి రెండు, మూడు పర్యాయాలు తిరగాల్సి వస్తోందని ఎన్యూమరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆ వివరాలు మీకెందుకు చెప్పాలి? :సర్వేలో మొత్తం 75 రకాల అంశాలపై సమగ్ర వివరాలు సేకరించాల్సి ఉంది. ఇలా ఒక్కో ఫ్యామిలీకి దాదాపు గంట సమయం పడుతోంది. అయితే తమకు అందుతున్న సంక్షేమ పథకాలు రద్దు అవుతాయేమోనన్న అపోహతో చాలామంది సరైన సమాచారం ఇవ్వడం లేదు. మరోపక్క ఉదయం పాఠశాల నిర్వహించి మధ్యాహ్నం సర్వేకు వెళ్లే ఉపాధ్యాయులకు గ్రామాల్లోని ఇళ్లు తాళాలతో దర్శనమిస్తున్నాయి.

ఇలా ఒక్కో ఇంటికి రెండు, మూడుసార్లు తిరుగుతున్నప్పటికీ పూర్తికావడం లేదని ఎన్యూమరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు గ్రామాల్లో ప్రజలు ఎన్యూమరేటర్ల్లను నిలదీస్తున్నారు. మాకేమైనా పథకాలు ఇస్తారా? మీకెందుకు వివరాలు చెప్పాలంటున్నారు. ద్విచక్రవాహనాలు, ట్రాక్టర్లు, కార్లు కన్పిస్తున్నా, అవి తమవికాదని చెబుతున్నారు. ఇలా చాలా చోట్ల సర్వే సాఫీగా సాగని పరిస్థితి నెలకొంది. 51వ కాలంలో స్థిరాస్తులు వివరాలను చెప్పడం లేదు. 52వ కాలమ్‌లో అంటే టీవీ, రిఫ్రిజరేటర్, ద్విచక్రవాహనం, కారు, వాషింగ్‌ మిషన్‌ తదితర వివరాలు అడిగారు. వాటిని కూడా ఎన్యూమరేటర్లకు చెప్పడం లేదు.

కొన్ని ప్రాంతాల్లో కులం వివరాలు తెలిపే క్రమంలో ఉపకులాలు చెప్పడంలేదు. మరికొన్నిచోట్ల సొంతింట్లో ఉన్నప్పటికీ, అద్దెఇల్లు అని చెబుతున్నారు. ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తులకే ఎలాంటి మోక్షంలేదని, సర్వే సమాధానాలు ఎందుకు చెప్పాలని నిలదీస్తున్నారు. పెద్దకొత్తపల్లి మండలంలోని ఓ గ్రామంలో సర్వేకోసం వెళ్తే కుక్కలను ఉసిగొల్పినట్లు ఓ ఎన్యూమరేటర్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఒక్కో ఎన్యూమరేటర్‌కు 150 నుంచి 175 ఇళ్లను కేటాయించారు.

గడువు 27లోగా సర్వే పూర్తయ్యేనా? : సమగ్ర సర్వే ఈనెల 9న ప్రారంభమైంది. ఈ సర్వే పూర్తిచేయడానికి ఈనెల 27 గడువు విధించింది. అయినప్పటికీ చాలా జిల్లాల్లో ఇప్పటి వరకు కేవలం 58.62 శాతం మాత్రమే సమగ్ర సర్వే పూర్తయ్యింది. మరో 10 రోజుల గడువు మాత్రమే ఉంది. సమగ్రసర్వే వందశాతం పూర్తి అవుతుందో లేదోనన్న సందేహం వ్యక్తమవుతోంది.

"సర్వే త్వరగా పూర్తిచేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నాం. మధ్యాహ్నం వెళ్తే ఇళ్లకు తాళాలు వేసి ఉంటున్నాయని మా దృష్టికి వచ్చింది. ఎన్యూమరేటర్లుగా ఉన్న టీచర్లు పాఠశాల వేళలకంటే ముందుగానే కొన్ని ఇళ్లు సర్వే చేయాలని ఆదేశాలను జారీ చేస్తాం. ఈనెల 27లోగా సర్వే వందశాతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం" -దేవసహాయం, అదనపు కలెక్టర్, నాగర్‌కర్నూల్‌

ఇంటికి వెళితే ఉండరు - ఆస్తి వివరాలు అడిగితే చెప్పరు - ఎన్యూమరేటర్లకు తప్పని సర్వే అష్టకష్టాలు

మా బ్యాంకు వివరాలు మీకెందుకు? - సమాచారం చెప్పేందుకు నిరాకరిస్తున్న ప్రజలు

Last Updated : Nov 18, 2024, 4:39 PM IST

ABOUT THE AUTHOR

...view details