Employees Joint Staff Council Meeting:ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో మరోమారు చర్చలు జరపనుంది. ఉద్యోగులు గత కొంత కాలంగా, పీఆర్సీతో పాటు పెండింగ్ బకాయిలు, డీఏ అరియర్లు , ఆర్ధిక, ఆర్ధికేతర అంశాలపై బిల్లుల చెల్లింపులకు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగుల సమస్యలపై పలుమార్లు చర్చలు జరిపింది. అయినప్పటికీ ఆ చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో, తాజాగా మరోమారు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వివిధ అంశాలపై చర్చలు జరపనున్న ప్రభుత్వం: ఉద్యోగులు చర్చలకు రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ఉద్యోగ సంఘాల నేతలను ఆహ్వానించింది. గురువారం మద్యాహ్నం 3 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్ లో నిర్వహించే చర్చలకు రావాల్సిందిగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని ఉద్యోగ సంఘాల నేతలకు సాధారణ పరిపాలన శాఖ ఆహ్వానించింది. పీఆర్సీతో పాటు పెండింగ్ బకాయిలు, డీఏ అరియర్లు, ఆర్ధిక, ఆర్ధికేతర అంశాలపై చర్చించనున్నట్టు ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు సమాచారం ఇచ్చింది. గత సమావేశాల్లో మధ్యంతర భృతిపై ఉద్యోగ సంఘాలు పట్టుపట్టడంతో సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. జూలై తర్వాత పీఆర్సీనే ప్రకటిస్తామని మంత్రుల కమిటీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని ఉద్యోగ సంఘాల నేతలకు స్పష్టం చేసింది. గత సమావేశంలో పెండింగ్ లో ఉన్న అంశాలు, ఉద్యోగుల హెల్త్ స్కీమ్ సహా వివిధ అంశాలపై చర్చలకు రావాల్సిందిగా ప్రభుత్వం ఏపీఎన్జీఓలు, రెవెన్యూ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగుల సంఘం సహా తదితర ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించింది.