ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేర్లే అని తీసిపారేయకండి - వీటిని సాగు చేస్తే - ఏడాదికి లక్షకు పైగా ఆదాయం! - ELURU WOMAN IN VETIVER CULTIVATION

వట్టివేర్ల సాగుతో లాభాలు ఆర్జిస్తున్న మహిళ - ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా ఆదాయ వనరుగా మార్పు

Vetiver Cultivation in Eluru
Vetiver Cultivation in Eluru (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 24, 2025, 6:00 PM IST

Eluru Woman in Vetiver Cultivation : బుర్రకు పదును పెట్టాలే కానీ ఆలోచనలకు కొదవుండదు. వాటిని ఆచరణలో పెడితే ఆదాయానికి ఢోకా ఉండదు. సరిగ్గా ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్నారు ఏలూరుకు చెందిన ఓ మహిళ. ఇంటి పనులు పూర్తయ్యాక ఖాళీ సమయాన్ని టీవీ చూస్తూనో, ఇరుగుపొరుగుతోనో పిచ్చాపాటీ కబుర్లతోనే వృథా చేయకుండా ఆ టైమ్​ని ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. వినూత్న రీతిలో వట్టివేర్లు సాగు చేస్తూ రైతులకు తాను ఏమాత్రం తీసిపోనని నిరూపిస్తున్నారు.

పార పట్టుకుని మట్టిని బకెట్లో నింపుతున్న ఈ మహిళ పేరు కోరళ్ల వల్లి. ఏలూరుకు చెందిన ఈమె భర్త కొంత కాలం క్రితం మృతిచెందారు. పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇంట్లో ఒక్కరే ఉండటంతో ఏమీ తోచేది కాదు. దీంతో టీవీ చూస్తూ కాలక్షేపం చేసేవారు. సమయాన్ని వృథా చేస్తే ఏమొస్తొంది? ఆ టైమ్​ని దేనికైనా కేటాయించి ఆదాయ వనరు పెంచుకోవచ్చనే ఆలోచన ఆమె మదిలో మెదిలింది. దానికి తగ్గట్టుగా ఏదైనా వినూత్నంగా చేయాలని తలచింది.

ఇంటర్నెట్​లో శోధించి కోయంబత్తూరులో పెద్ద ఎత్తున సాగవుతున్న వట్టివేర్ల గురించి వల్లి తెలుసుకుంది. తెలిసిన వారి ద్వారా అక్కడికి వెళ్లి అందులో లాభనష్టాలు, మార్కెటింగ్ సదుపాయాలపై ఆరాతీసింది. ఈ సాగు లాభదాయకంగా ఉందని తెలుసుకుని తిరిగి ఏలూరు వచ్చి వట్టివేర్ల సాగును ఆచరణలో పెట్టింది. ఆలోచన ఉండాలే కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం పెద్ద కష్టమేమీ కాదని నిరూపిస్తూ కేవలం తన ఇంటి మేడపై ఉన్న కాస్త స్థలాన్ని వీటి పెంపకానికి ఎంచుకున్నారు.

Vetiver Grass Cultivated in Eluru : ముందుగా ప్లాస్టిక్ బకెట్లలో పైపులు ఉంచి అందులో కొబ్బరిపీచు, వర్మి కంపోస్టు కలిపి దాన్ని పైపుల్లో నింపుతారు. ఆ తర్వాత పైపు పైభాగం నుంచి కొద్దిగా నీళ్లు పోసి వట్టివేర్ల మొక్కను నాటుతారు. ఇలా దాదాపు 100 పైపుల్లో ప్రయోగాత్మకంగా ఈ సాగు ప్రారంభించారు. ఇందుకు అవసరమైన సహకారాన్ని కోయంబత్తూరుకు చెందిన ఎకో గ్రీన్ సంస్థ నుంచి పొందుతున్నారు. ఈ పంటకు వేడి వాతావరణం బాగా అనుకూలం కాగా వారానికి రెండు నుంచి మూడు సార్లు నీటిని అందిస్తే సరిపోతుంది. ఏడాదికి రెండుసార్లు వేర్లను కత్తిరించి విక్రయించడం ద్వారా లక్షకు పైగా ఆదాయం సంపాదించవచ్చని వల్లి చెబుతున్నారు.

"ఎకో గ్రీన్ సంస్థ వారు మెటిరీయల్ ఇస్తారు. మనం వట్టివేర్లను పెంచి వారికి ఇస్తే డబ్బులు ఇస్తారు. ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా వట్టివేర్లు సాగు చేస్తున్నాను. వట్టివేర్ల సాగుతో ఏడాదికి లక్షకు పైగా సంపాదించవచ్చు. ఆసక్తి ఉన్న మహిళలు వస్తే ఈ సాగు గురించి వివరిస్తాను."- కోరళ్ల వల్లి, ఏలూరు

మహిళ వినూత్న ఆలోచనను గమనించిన అనేకమంది వట్టివేర్ల సాగులో పెద్దగా కష్టం లేకపోవడం, ఆదాయం బాగుండటంతో ఇటువైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఆమె చేసిన ప్రయోగాత్మక సాగును పరిశీలించి తాము కూడా ఇదే రకంగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏలూరులో తొలిసారిగా ఈ పంట సాగును ప్రారంభించిన వల్లి ఆసక్తి ఉన్న మహిళలు ముందుకు వస్తే వీటి విధానం గురించి వివరిస్తానని చెబుతున్నారు. తద్వారా ఖాళీ సమయాన్ని వృథా చేసుకోకుండా ఆదాయ మార్గంగా మలుచుకోవచ్చని సూచిస్తున్నారు.

ఆదర్శ రైతు - 870 ఎకరాల్లో ఆధునిక సాగు

"ప్రకృతి సాగు పుడమికి శ్రీరామరక్ష" - మాస్టర్‌ ట్రైనర్‌ ద్వారా శిక్షణ ఇప్పిస్తున్న ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details