Electricity Charges Increased Under YCP Gov:పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్ విద్యుత్ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలపై అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీల భారం పడిందని, తాను అధికారంలోకి వచ్చాక భారాన్ని తగ్గిస్తానంటూ జగన్ నమ్మబలికారు. అధికారం చేపట్టిన మొదటి సంవత్సరంలోనే పేదలు, సామాన్యులు, పరిశ్రమలు అన్న తేడా లేకుండా అన్ని వర్గాలకు షాక్‌ఇచ్చారు.
ఐదేళ్లలో ఐదు సార్లు విద్యుత్ చార్జీల పెంపు - పేదలపై ₹4వేల కోట్ల భారం
వేలల్లో విద్యుత్ ఛార్జీలు: అల్లూరి జిల్లా పాడేరులో విద్యుత్ బిల్లులు సగటు కుటుంబాలకు భారంగా మారాయి. వివిధ చార్జీల పేర్లతో విద్యుత్ బిల్లులు సగటు కుటుంబానికి గుదిబండగా మారాయని వాపోతున్నారు. గతంలో వందల్లో ఉండే బిల్లులు జగనన్న హయాంలో వేలల్లోకి మారిపోయాయి. ఏ వ్యాపారిని అడిగినా ఒకటే మాట. ఏ నెల సక్రమ పద్ధతిలో బిల్లులు రాలేదని, ఒక్కో నెలా ఒక్కో విధంగా వస్తుందని సమాధానం ఇస్తున్నారు. వేలల్లోకరెంటు బిల్లులు వస్తే సామాన్యులు ఎలా కట్టాలని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ప్రతి దుకాణంలోని ఇదే పరిస్థితి.