Margadarshi Chitfunds: విశాఖపట్నంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థకు చెందిన సీతంపేట బ్రాంచ్ సిబ్బంది బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తీసుకెళ్తుండగా స్వాధీనం చేసుకున్న నగదు, చెక్కుల్ని జిల్లా యంత్రాంగం తిరిగి అప్పగించింది. చందాదారులు చెల్లించిన రూ. 51,99,800 నగదు, రూ. 36,88,675 విలువైన 51 అకౌంట్ పేయీ చెక్కుల్ని ఏప్రిల్ 2న బ్యాంకులో జమచేసేందుకు మార్గదర్శి సిబ్బంది తీసుకెళుతుండగా, చెకింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది.
మార్చి 30, 31 తేదీలు శని, ఆదివారాలు కావడం, ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవు కావడంతో, 30, 31 తేదీల్లో చందాదారులు చెల్లించిన మొత్తాన్ని ఏప్రిల్ 2న బ్యాంకులో జమ చేసేందుకు తీసుకెళుతున్నామని చెకింగ్ స్క్వాడ్‌కి మార్గదర్శి సిబ్బంది తెలియజేశారు. డెయిలీ క్యాష్ రిజిస్టర్‌ని అందజేశారు. వాటిలో చిట్‌ల వివరాలు, ఎవరి నుంచి ఆ నగదు, చెక్కులు వచ్చాయో ఆ చందాదారుల పేర్లు స్పష్టంగా ఉన్నాయి. అయినా చెకింగ్ స్క్వాడ్ వాటిని పరిగణనలోకి తీసుకోకుండా మొత్తం నగదు, చెక్కులను సీజ్ చేసింది. ఈ విషయాన్ని మార్గదర్శి యాజమాన్యం.. ఆదాయపన్ను విభాగం, రిటర్నింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఖాతాదారులు జమజేసిన నగదుకు రసీదులు, అంతకుముందు పదిరోజుల బ్యాంకు లావాదేవీల స్టేట్‌మెంట్లు సహా ఆధారాలన్నీ అందజేసింది. గత సంవత్సరం ఇదే కాలానికి సంబంధించి డెయిలీ క్యాష్ రిజిస్టర్, బ్యాంక్ స్టేట్‌మెంట్లు కూడా అందజేసింది.
పరిశీలించిన ఐటీ విభాగం: మార్గదర్శి సంస్థకు చెందిన నగదు, చెక్కుల్ని సీజ్ చేయడం సరికాదని ఐటీ విభాగం స్పష్టంచేసింది. ఆ మేరకు ఐటీ విభాగం డిప్యూటీ డైరెక్టర్ ఎం.రాజీవ్ రమేష్ ఏప్రిల్ 17న కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా రిడ్రెసల్ కమిటీ కన్వీనర్‌కి లేఖ రాశారు. రిడ్రెసల్ కమిటీ కన్వీనర్, రిటర్నింగ్ అధికారి, పోలీసు సిబ్బంది మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. పోలీసుల నుంచి దర్యాప్తు నివేదిక రప్పించుకున్న రిటర్నింగ్ అధికారి... మార్గదర్శి సిబ్బంది నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, చెక్కులు విడుదల చేయాలని జిల్లా ట్రెజరీ అధికారికి ఈ నెల ఆరో తేదీన లేఖ రాశారు. ఏడో తేదీన వాటిని మార్గదర్శి సిబ్బందికి అందజేశారు. ఐటీ విభాగం క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా 20 రోజుల సమయం తీసుకున్నారు.
లుక్ఔట్ సర్క్యూలర్ జారీ కోర్టు ధిక్కరణే కదా - మార్గదర్శి కేసులో ఏపీ సీఐడీని నిలదీసిన తెలంగాణ హైకోర్టు! అఫిడవిట్ దాఖలు చేస్తామన్న అధికారులు
‘సాక్షి’ మీడియాకు చెంపదెబ్బ:అన్ని ఆధారాలు, పత్రాలు చూపించినా, మార్గదర్శి సిబ్బంది నుంచి చెకింగ్ స్క్వాడ్ నగదు, చెక్కులు స్వాధీనం చేసుకోవడమే నిబంధనలకు విరుద్ధమైతే, ఆ ఘటనపై జగన్ పత్రిక సాక్షి మీడియా అడ్డగోలుగా దుష్ప్రచారం చేసింది. ఎన్నికల కోడ్‌కి విరుద్ధంగా నగదు, చెక్కులు తరలిస్తున్నారని దుష్ప్రచారానికి, బురదజల్లే కార్యక్రమానికి పూనుకుంది. ఆ నగదు, చెక్కులకు మార్గదర్శి సిబ్బంది అన్ని ఆధారాలు, పత్రాలు అందజేసినా... పోలీసులు ఆధారాలు అడిగితే చూపించలేదంటూ సాక్షి పదే పదే అడ్డగోలుగా రాసింది. ఆ డబ్బును ఒక ప్రధాన పార్టీ అభ్యర్థులకు చేరవేసేందుకే తీసుకెళుతున్నారంటూ మరో అసంబద్ధ ఆరోపణను జోడించింది. గత ఎన్నికల్లో కూడా మార్గదర్శి తన బ్రాంచ్ ద్వారా ఆ పార్టీ అభ్యర్థులకు నిధులు సమకూర్చిందంటూ అసత్య కథనాలను ప్రచురించింది. మార్గదర్శిపై విషం చిమ్మేందుకు, చందాదారుల్లో నమ్మకాన్ని దెబ్బతీసి, అపోహలు సృష్టించేందుకు ప్రయత్నించింది. మార్గదర్శి సిబ్బంది నుంచి నగదు, చెక్కులు స్వాధీనం చేసుకోవడం సరికాదని ఐటీ విభాగం స్పష్టం చేయడం, వాటిని తిరిగి అప్పగించడం... తిమ్మిని బమ్మిని చేసైనా మార్గదర్శి ప్రతిష్ఠను మసకబార్చాలనుకునే కుట్రదారులకు చెంపపెట్టు. మార్గదర్శి కఠోర క్రమశిక్షణకు పెట్టిందని పేరని, చందాదారుల ప్రయోజనాల్ని కాపాడటంలో అకుంఠిత నిబద్ధత, అంకితభావంతో పనిచేస్తుందని మరోసారి రుజువైంది.
సుప్రీంలో మార్గదర్శికేసు - గాదిరెడ్డి యూరిరెడ్డికి చుక్కెదురు