Ramoji Rao Success Story : నిరంతర శ్రమ నిత్యం కొత్తదనం కోసం తపన నిజాయితీతో కూడిన వ్యాపారం పుట్టిన నేలకోసం, చుట్టూ ఉన్న సమాజం కోసం గట్టిమేలు తలపెట్టే మొక్కవోని సంకల్పం చెక్కు చెదరని ఆత్మస్థైర్యం అన్నీ కలిసిన ఆధునిక రుషి రామోజీరావు. ఆయన ఒక్కొక్క చెమట చుక్క చిందించి పగలూరాత్రి పరిశ్రమించి సృష్టించిన మహాసామ్రాజ్యం రామోజీ గ్రూప్!.
అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ చెరగని ముద్రవేశారు రామోజీరావు. విలువుల పునాదులపై నిర్మించుకున్న గెలుపుబాటలో ముందుకు సాగారు. సరికొత్త లక్ష్యాల సాధనకు వడివడిగా అడుగులు వేసి అసంఖ్యాక ప్రజాహృదయాల్ని గెలుచుకున్నారు. మీడియా సంస్థ సారథిగా ప్రజాహితంకోసం పాటుపడినా మాతృభాష పరిరక్షణకు నడుంకట్టినా ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు. చైతన్య దీపికల్లాంటి సినిమాల నిర్మాతగా భూతల స్వర్గాన్ని తలపించే చిత్రనగరి సృష్టికర్తగా ప్రత్యేక గుర్తింపు పొందారు. 25 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి దాదాపు లక్ష మందికి పరోక్ష లబ్ధి చేకూర్చారు.
ఉషోదయంతో సత్యం నినదించుగాక అంటూ తెలుగువాకిళ్ల వెలుగుచుక్కలా ప్రభవించే "ఈనాడు" క్షణక్షణం ఆనంద వీక్షణం అందించే వినోదాల ప్రభంజనం "ఈటీవీ" యావద్భారతానికి 13 భాషల్లో క్షణాల్లో వార్తలు అందించే డిజిటల్ విప్లవం "ఈటీవీ భారత్" దుక్కిదున్ని జాతికి పట్టెడన్నం పెట్టే రైతన్నకు అండదండగా నిలిచే "అన్నదాత" ప్రపంచంలోనే అతి పెద్ద చిత్రనిర్మాణ ప్రాంగణం "రామోజీ ఫిలింసిటీ" అన్నీ రామోజీరావు ఆలోచనల ప్రతిరూపాలే.
రామయ్య టు రామోజీ :నాటి మద్రాసు ప్రెసిడెన్సీలో రాజకీయ చైతన్యం వెల్లివిరిసిన కృష్ణా తీరం గుడివాడ పట్టణం. సమీపాన ఓ పచ్చని పల్లెటూరు పెదపారుపూడి. అక్కడ ఓ వెచ్చని మమతల గూడు చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మగారిల్లు. 1936వ సంవత్సరం. నవంబర్ 16. పెద్ద అక్షరాలతో రాసుకోవాల్సిన తేదీ. ఆ దంపతుల ఇంట వరాల బిడ్డ రామయ్య పుట్టిన రోజు అది. ఇద్దరు అక్కలు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ తర్వాత ఎన్నో ఏళ్లకు జన్మించిన గారాల బిడ్డ. తాతయ్య పేరు రామయ్యనే ఆ చిన్నారికి పెట్టారు. కానీ బాల రామయ్య ఘటికుడు, ఆధునికుడు. బడిలో మాస్టారుకు తన పేరు రామోజీరావు అని చెప్పాడు. అలా రామయ్య రామోజీరావు అయ్యారు. ఇంట్లో అంతా ఆశ్చర్యపోయారు. బాలుని ప్రతిభకు మురిసిపోయారు. అలా తన పేరు తనే పెట్టుకున్న రామోజీలో విలక్షణత, సృజనాత్మకత నాడే మొగ్గతొడిగాయి.
పెదపారుపూడి అటు కోవెల గంటల సవ్వడి, దైవ స్తోత్రాలు. ఇటు పక్షుల రెపరెపల గానాలు. మరోదిశగా పచ్చటి పంటచేలు, చెరువు ఒడ్డు. రామోజీ ప్రకృతి ప్రేమకు, కళాత్మక ఆలోచనలకు పల్లె కాన్వాసుగా నిలిచింది. చిత్రకారుడు కావటానికి నేపథ్యమైంది. భవిష్యత్తు దర్శనం చేసింది. ప్రాథమిక విద్యపూర్తయ్యాక పైచదువులకు రామోజీ గుడివాడ వెళ్లారు. మునిసిపల్ స్కూల్లో 8వ తరగతిలో చేరారు. 11వ తరగతికి సమమైన అప్పటి సిక్స్త్ ఫాం చదివారు. రామోజీకి చదువు కంటే, కళలు, రాజకీయాలపై ఆసక్తి మిన్న. మాటల్లో నిశిత దృష్టి, సునిశిత పరిశీలన కనపడేది. గుడివాడ బజారులో నడిచి వెళ్తుంటే వరుసగా ఒకే వ్యాపార దుకాణాలు కనపడేవి. స్టీల్ సామాన్ల కొట్లయినా, ఫ్యాన్సీ షాపులైనా ఏవైనా వరుసగా అవే వ్యాపారాలు. ఇదేమిటి? ఇలా అందరూ ఒకే వ్యాపారం చేసే బదులు వేర్వేరు వ్యాపారాల్లో రాణించి లాభపడవచ్చు కదా? అని మిత్రులతో అనేవారు. అనుకరణలు వద్దని, సొంత ఒరవడే శ్రేయస్కరమని చెప్పేవారు. ఇందుకే కావచ్చు. రామోజీరావు ప్రారంభించిన ప్రతి వ్యాపారంలో ఓ నవ్యత, వైవిధ్యం కనపడతాయి.
కమ్యూనిజం- గాంధీయిజం :1951లో రామోజీ హైస్కూలు చదువు ముగిసింది. గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. అనంతరం అక్కడే BSC పూర్తయింది. చదువుకునే రోజుల్లో రామోజీరావు కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడు. చండ్ర రాజేశ్వరరావు, సుందరయ్య ఆయనకు ఆరాధ్య నేతలు. సత్యాగ్రహ సిద్ధాంతకర్త, ప్రజాధన పరిరక్షణకు ఉద్దేశించిన ధర్మ కర్తృత్వ సిద్ధాంత ఆవిష్కర్త మహాత్మా గాంధీ రామోజీకి ఎంతో ఇష్టం. ఆయన దళిత జనోద్ధరణ అంటే మరీమరీ ఇష్టం.
సంఘర్షణ :ప్రతి మనిషి జీవితాన్ని మలుపు తిప్పే సంఘటనలు ఉంటాయి. రామోజీరావుకు అలాంటి అనుభవ నేపథ్యమే ఉంది. డిగ్రీ తర్వాత భిలాయ్‌లో ఓ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. పిలుపు వస్తుందన్న గట్టి నమ్మకం క్రమంగా సడలింది. నిరాశే మిగిలింది. రామోజీ మనసులో సంఘర్షణ మొదలైంది. తనే పదిమందికి పనిచ్చేలా ఎదగాలని భావించారు. కానీ కొంత విరామం తీసుకున్నారు. ఈ దశలో రామోజీరావు దిల్లీలో మళయాళీ వ్యాపారవేత్త అనంత్ నెలకొల్పిన వాణిజ్య ప్రకటనల సంస్థలో ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరారు. తర్వాత కొద్దికాలానికే అమెరికా అవకాశం తలుపు తట్టింది. మళ్లీ అంతర్మథనం! అయినా అయిన వాళ్ల కోసం అవకాశాన్ని ఒదులుకున్నారు. మాతృదేశంలోనే ఉండిపోవాలని నిశ్చయించారు.
తొలి అడుగు : 1961 ఆగస్టు 19 రామోజీ జీవితంలో కొత్త మలుపు. యుక్త వయసు రావటంతో పెళ్లికి ఇంట్లో ఒత్తిడి పెరిగింది. కృష్ణాతీరంలో పెనమలూరులో తాతినేని వారి అమ్మాయి రమాదేవితో చూపులు కలిశాయి. రామోజీరావు-రమాదేవి వివాహం బెజవాడ కన్యకా పరమేశ్వరి మందిరంలో జరిగింది. రమాదేవి అసలు పేరు రమణమ్మ. అది అమ్మమ్మ పేరు. తనపేరు కొంచెం ఆధునికంగా వుండాలని ఆమె అభిలాష. స్కూల్లో చేరినప్పుడు తన పేరు రమాదేవిగా రాయించారు. అటు రామయ్య, ఇటు రమణమ్మ తమ పేర్లు మార్చుకోవటం కాకతాళీయమే! వివాహానంతరం, సతీమణి రమాదేవితో కలసి రామోజీరావు దేశ రాజధానికి మకాం మార్చారు. దక్షిణ దిల్లీ కరోల్‌బాగ్‌లో నివసించారు.
దిల్లీలో ఆర్టిస్టుగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. కృషి ఉంటే ఘన ఫలితాలు తథ్యమనే నమ్మకం కుదిరింది. నాయకత్వ లక్షణాలు అలవడ్డాయి. వ్యాపార దక్షత పెరిగింది. ముఖ్య విషయాలలో స్పష్టత వచ్చింది. నిరంతర అధ్యయనం, నిశిత పరిశీలనతో ప్రజాహిత వ్యాపారం చేపట్టాలని రామోజీ భావించారు. తను చేసే పని పదిమందికీ ప్రయోజకంగా ఉండాలని అభిలషించారు. 1962లో పెద్దకుమారుడు కిరణ్ పుట్టిన తరువాత ఓ నిర్ణయానికి వచ్చారు. అదే ఏడాది రామోజీ దిల్లీలో ఉద్యోగపర్వం ముగించారు. వ్యాపార రంగ ప్రవేశానికి మార్గం నిర్మించుకునేందుకు సిద్ధమయ్యారు.
విజయానికి 'మార్గదర్శి' : రామోజీ రావు వ్యాపార ప్రస్థానంలో తొలి అడుగు మార్గదర్శి చిట్‌ఫండ్స్. 1962లో నమ్మకమే పెట్టుబడిగా, విశ్వసనీయతే ఆలంబనగా ఏర్పాటైంది ఆ సంస్థ. 'మార్గదర్శి తోడుంటే ఆనందం మీ వెంటే' అనే నినాదం తర్వాత కాలంలో లక్షలాది ఖాతాదారులకు తారకమంత్రమైంది.
చిట్ ఫండ్ వ్యాపారం అంటే అదేదో మహిళల వ్యవహారం అని భావించిన రోజుల్లో రామోజీ రావు అలాంటి మాటలను ఖాతరు చేయలేదు. పట్టుదలతో ముందుకు సాగారు. వసూళ్లు, చెల్లింపుల్లో కచ్చితత్వంతో ఖాతాదారుల్లో విశ్వాసం ఏర్పడింది. సిబ్బంది క్రమశిక్షణ, అంకిత భావం, యాజమాన్య విశ్వసనీయత వల్ల సంస్థ శరవేగంగా అభివృద్ధి చెందింది. ఆర్థిక క్రమశిక్షణ, అంకితభావం, విశ్వసనీయత ఈ మూడూ మార్గదర్శికి మూడు మంత్రాక్షరాలు. అవే మార్గదర్శిని దేశంలోనే అగ్రశ్రేణి చిట్‌ఫండ్ సంస్థగా నిలిపాయి. 60 ఏళ్ల ప్రస్థానంలో 60లక్షల మంది ఖాతాదారులకు సేవలు అందించిన ఘనత దక్కేలా చేశాయి. అదే స్ఫూర్తితో ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో 113 శాఖలు, 3లక్షలకు పైగా ఖాతాదారులు, 4వేల100 మందికిపైగా ఉద్యోగులు, 18వేలకుపైగా ఏజెంట్లతో విలువల బాటలో ముందుకు సాగుతోంది మార్గదర్శి.
రైతుబిడ్డగా రుణం తీర్చుకోవాలని :మార్గదర్శితో రామోజీ రావు విజయయాత్రలో తొలి అడుగుపడింది. అయినా ఆయన ఏనాడూ మూలాలకు దూరంగా వెళ్లలేదు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి రైతుల కష్టాల్ని చూస్తూ పెరిగిన ఆయన సాగుబడికి తనవంతు సాయం చేయాలని సంకల్పించారు. ఆ బలమైన ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే అన్నదాత! 1969లో మీడియా రంగంలో తొలి అడుగువేస్తూ అన్నదాత పత్రికను ప్రారంభించారు రామోజీరావు. వ్యవసాయ వైజ్ఞానిక కేంద్రాలకు, కర్షకులకు మధ్య తిరుగులేని వారథిని నిర్మించారు. సేద్యంలో అధునాతన విధానాలు, సాంకేతిక పద్ధతులపై అన్నదాత పత్రిక ద్వారా ఎనలేని సమాచారమిచ్చారు. మూస విధానాలు దాటి ఏనాడూ ప్రయోగాల జోలికివెళ్లని తెలుగు రైతుల్ని అన్నదాత కొత్తబాట పట్టించింది. అధునాతన సాంకేతిక పద్ధతుల్ని అందిపుచ్చుకుని సేద్యంలో సరికొత్త విప్లవానికి తెరతీసేలా ప్రోత్సహించింది. అలా కర్షకులకు దిక్సూచిలా మారిన అన్నదాత అందుకు తగినట్లుగా ఎన్నో పురస్కారాలు దక్కించుకుంది.
తెలుగునాట నవోదయం :తెలుగు పత్రికా ప్రపంచంలో నవ శకానికి నాంది 'ఈనాడు'. 1974 ఆగస్టు 10న విశాఖ సాగరతీరంలో రామోజీరావు ప్రారంభించిన 'ఈనాడు' దినపత్రిక తెలుగు నాట ఓ సంచలనం. అణువణువు కొత్తదనంతో, ప్రజల పక్షాన అక్షరయుద్ధంతో ప్రారంభించిన 4ఏళ్లలోనే పాఠకుల మానసపుత్రికగా మారింది. ప్రాంతీయ దినపత్రికల చరిత్రలోనే కొత్త ఒరవడి సృష్టించింది. వార్తాపత్రిక డోర్ డెలివరీ విధానం అప్పట్లో ఓ సంచలనం. అప్పటివరకు వార్తాపత్రిక కావాలంటే ఎవరైనా దుకాణానికి వెళ్లి తెచ్చుకోవాల్సిందే. మారుమూల ప్రాంతాలవారైతే పేపర్ కోసం ఆ రోజు సాయంత్రం వరకో, మరుసటి రోజు ఉదయం వరకో వేచి చూడాల్సిందే. అలాంటి ఇబ్బంది లేకుండా రోజూ సూర్యోదయానికి ముందే ఈనాడు పత్రిక ఇంటికి చేరేలా సరికొత్త వ్యవస్థను సృష్టించారు రామోజీరావు. తర్వాతికాలంలో ఇతర వార్తాపత్రికలు ఇదే ఏజెన్సీ విధానాన్ని అవలంబించడం ప్రారంభించాయి.
జిల్లా సంచికలు తీసుకురావాలన్న ఆలోచన రామోజీరావుదే. సగటు పాఠకుడు తనచుట్టూ జరిగే చిన్నచిన్న ఘటనల్ని సైతం తెలుసుకునేందుకు వీలు కల్పించాలన్నదే ఆయన అభిమతం. తర్వాతికాలంలో నియోజకవర్గ పేజీల్ని ప్రవేశపెట్టి స్థానిక వార్తలకు పెద్దపీట వేశారు. అవినీతి పాలకుల చీకటి లెక్కలు బయటపెట్టే బ్రహ్మాస్త్రంగా సమాచార హక్కు చట్టాన్ని ఎలా వాడుకోవచ్చో 'ఈనాడు ముందడుగు' ద్వారా సామాన్యులకు తెలియచెప్పారు.