Eenadu 50 Years Celebrations : ఈనాడు దృష్టిలో సమకాలీన వార్తల ప్రచురణే కాదు, సామాజిక బాధ్యత కూడా పత్రికల కర్తవ్యమే! ఐదు దశాబ్దాల ప్రస్థానంలో ఈనాడు అక్షరంలోనే కాదు, ఆచరణలోనూ అదే చిత్తశుద్ధి చాటుకుంటోంది. అది 1976 ఈనాడు పుట్టి అప్పటికి రెండేళ్లే! వరుసపెట్టి మూడు తుపాన్లు తెలుగునేలను కన్నీటిలో ముంచాయి. లక్షల ఎకరాల్లో పంటల్ని ఉడ్చేశాయి. సర్వం కోల్పోయిన అసంఖ్యాక ప్రజల ఆర్తనాదాలకు ఈనాడు చలించింది. ఆరోజుల్లోనే పదివేల రూపాయలతో తుపాను బాధితుల సహాయ నిధి ప్రారంభించింది. శక్తిమేరకు సాయం చేయాలంటూ ప్రజలనూ అర్థించింది. ఈనాడు పిలుపుతో తెలుగు పాఠకులు పెద్దమనసు చాటారు. నెల రోజుల్లో 64 వేల 756 రూపాయల విరాళాలు పోగయ్యాయి. ఆ మొత్తాన్నీ ప్రభుత్వానికి అందించింది ఈనాడు.
ఆ గ్రామానికి పునరుజ్జీవం పోసిన ఈనాడు: 1977లో దివిసీమ ఉప్పెన బాధితులు తరతరాలూ గుర్తుంచుకునే సాయం చేసింది ఈనాడు. ఆనాటి జలప్రళయంలో వేల మంది జలసమాధికాగా తినడానికి తిండి, కట్టుకోడానికి బట్టల్లేక రోడ్డున పడినవారందరో! వారిని ఆదుకునేందుకు 25 వేల రూపాయలతో సహాయ నిధి ప్రారంభించింది. ఈనాడు పిలుపునకు పాఠకుల పెద్దమనసు తోడై, మొత్తం 3 లక్షల 73 వేల 927 రూపాయలు పోగైంది. ఆ డబ్బు నాటి ఉప్పెనలో శిథిలమైన పాలకాయతిప్ప గ్రామానికి పునరుజ్జీవం పోసింది. రాష్ట్ర ప్రభుత్వం, రామకృష్ణ మిషన్ సహకారంతో 112 ఇళ్లు కట్టించింది. ఆ మత్స్యకార గ్రామానికి పరమహంసపురమని కొత్త పేర పెట్టింది! ఆ గ్రామ పునర్నిర్మాణానికి ఖర్చు చేయగా మిగిలిన సొమ్ముతో కోడూరు సమీపంలోని కృష్ణాపురంలో మరో 22 ఇళ్లు కట్టించారు.
1986లో గోదావరి జిల్లాల కన్నీరు తుడిచింది ఈనాడు! ఆనాటి వరదల్లో ఆకలికేకలతో అలమటించిన బాధితులకు అన్నపానీయాలు అందించింది. 50 వేల మందికి ఆహార పొట్లాలు అందజేసింది. విశాఖలోని డాల్ఫిన్ హోటల్స్ ప్రాంగణంలో ఆహారం వండించి గ్రూప్ ఉద్యోగుల ద్వారా బాధితులకు చేరవేయడం ఈనాడు మానవత్వానికి మచ్చుతునకగా ప్రశంసలందుకుంది.
ప్రజల కష్టాలపై తల్లడిల్లిన ఈనాడు: 1996 అక్టోబర్‌లో ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో, నవంబర్‌లో గోదావరి జిల్లాల్లో తుపాన్ విధ్వంసం సృష్టించింది. ప్రజల కష్టాలపై తల్లడిల్లిన ఈనాడు, 25 లక్షల రూపాయలతో సహాయ నిధి ప్రారంభించింది. దయార్థ్రహృదయాలూ చేతులు జోడించడంతో మొత్తం కోటి 60 లక్షల రూపాయలు పోగైంది. ఈ నిధులు వరద బాధితుల్లో అత్యధిక మందికి ఉపయోగపడాలని సంకల్పించింది ఈనాడు. మామూలు రోజుల్లో బడుల్లా తుపాన్ల సమయాల్లో పునరావాస శిబిరాలుగా ఉపయోగపడేలా సూర్య భవనాలు నిర్మించింది. ఏఏ గ్రామాల్లో భవనాలు అవసరమో 'ఈనాడు' బృందాలు శోధించి రెండు నెలల్లోనే 60 గ్రామాల్లో నిర్మాణాలు పూర్తిచేయించాయి. ఈనాడు స్ఫూర్తితో దాతలు కూడా సిమెంట్, ఇనుము, మెటల్, ఇసుక సమకూర్చి దాతృత్వం చాటుకున్నారు.
హుద్‌హుద్ తుపాను బాధితుల కోసం సాయం: 2009 అక్టోబర్‌లో కృష్ణ, తుంగభద్ర, కుందూనదుల మహోగ్రరూపానికి కకావికలమైన కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల కన్నీళ్లు తుడిచింది ఈనాడు. తక్షణ సాయంగా లక్షా 20 వేల ఆహార పొట్లాలు పంపిణీ చేసి బాధితుల ఆకలి తీర్చింది. కోటి రూపాయలతో సహాయ నిధి ఏర్పాటు చేసింది. దాతల విరాళాలతో 6 కోట్ల 5 లక్షల 58 వేల 662 రూపాయలు పోగయ్యాయి. ఆ డబ్బుతో మహబూబ్‌నగర్ జిల్లాలో 1110 చేనేత కుటుంబాలకు మగ్గాలు అందజేసింది. కర్నూలు జిల్లాలో 'ఉషోదయ పాఠశాల భవనాలు' నిర్మించి ప్రభుత్వానికి అప్పగించింది ఈనాడు. 2014 అక్టోబరు 12న ఉత్తరాంధ్ర వెన్ను విరిచిన హుద్‌హుద్ తుపాను బాధితుల కోసం ఈనాడు’ 3 కోట్ల సాయం ప్రకటించింది! ప్రజలు ముందుకొచ్చి మరో 3 కోట్ల 16 లక్షలు విరాళాలిచ్చారు. మొత్తం 6 కోట్ల 16 లక్షల రూపాయల సహాయనిధితో విశాఖపట్నం జిల్లా తంతడి- వాడపాలెం గ్రామంలో 80, శ్రీకాకుళం జిల్లా పాత మేఘవరంలో 36, ఉమ్మిలాడలో 28 ఇళ్లు నిర్మించింది.
పండుటాకులకు నిలువ నీడ కల్పించిన రామోజీరావు:2020లో భారీ వర్షాలకు తెలంగాణ ప్రాంతంలో తీవ్ర నష్టం జరిగినప్పుడూ సీఎం సహాయ నిధికి ఈనాడు గ్రూప్ 5 కోట్ల రూపాయల విరాళం అందించింది! 2020లో కరోనా విపత్తు సమయంలో తెలుగు రాష్టాలకు విడివిడిగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పదేసి కోట్ల చొప్పున మొత్తం 20 కోట్ల రూపాయల భూరి విరాళం ఇచ్చి తెలుగు ప్రజలకు ఈనాడు ఎన్నడూ తోడుంటుందనే భరోసా ఇచ్చింది. రామోజీ ఫౌండేషన్ ద్వారా కృష్ణా జిల్లా పెదపారుపూడి, రంగారెడ్డి జిల్లా నాగన్‌పల్లి గ్రామాలను దత్తత తీసుకుని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దింది! మంచిర్యాల, భద్రాచలం, కర్నూలులో 5 కోట్ల రూపాయలతో వృద్ధాశ్రమాలు నిర్మించి పండుటాకులకు నిలువ నీడ కల్పించారు రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావు.
ఒడిశాకూ ఆపన్న హస్తం: తెలుగు నేలపై సాయం చేసినట్లే 1999లో తుపాను గాయంతో తల్లడిల్లిన ఒడిశాకూ ఆపన్న హస్తం అందించింది ఈనాడు. తన వంతుగా 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించింది. పాఠకులు, దాతల స్పందనతో 45 లక్షల 83 వేల 148 రూపాయలు పోగయ్యాయి. ఆ డబ్బుతో రామకృష్ణా మిషన్ ద్వారా జగత్సింగ్‌పూర్ జిల్లా కోనాగుల్లి గ్రామంలో 60 పక్కా గృహాలు కట్టించారు. 2001లో భూకంపంతో భీతిల్లిన గుజరాత్‌కూ 25 లక్షల రూపాయలతో ఈనాడు సహాయ నిధి ప్రారంభించింది.